భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత 2026 ఆధ్వర్యంలో, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్’ మరియు ‘అస్సెట్ రికవరీ ఎక్స్‌పర్ట్ నెట్‌వర్క్’ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిశాయి. ఆగస్టు 4 మరియు 5 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సమావేశాలకు బ్రిక్స్ సభ్య దేశాల నుంచి ప్రతినిధులు, ఆర్థిక నిఘా వర్గాలు, చట్ట అమలు సంస్థల నిపుణులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారత్ నిర్దేశించిన “స్థిరత్వం, నూతన ఆవిష్కరణలు, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం” అనే ప్రధాన ఇతివృత్తానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అవినీతి నిర్మూలన, ఆర్థిక నేరాల అరికట్టుపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.
ఈ అంతర్జాతీయ సమావేశాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శి రచన షా అధికారికంగా ప్రారంభించారు. సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతుండగా, అవినీతి పట్ల భారతదేశం అవలంబిస్తున్న ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేని) విధానాన్ని స్పష్టంగా వివరించారు. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి మరియు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అవినీతి రహిత వాతావరణం, సమర్థవంతమైన వ్యవస్థలు, సాంకేతికత ఆధారిత పాలన మరియు సుదీర్ఘ అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. బ్రిక్స్ కూటమి కేవలం ఆలోచనలను పంచుకునే వేదిక స్థాయి నుంచి ప్రత్యక్షంగా కార్యాచరణ అమలు చేసే స్థాయికి రూపాంతరం చెందుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
సమావేశంలో భారత్ తీసుకువచ్చిన ప్రధాన ప్రతిపాదన అయిన “ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నిందితులను చట్టం ముందుకు తీసుకురావడం మరియు పరస్పరం అప్పగించడం” అనే అంశంపై బ్రిక్స్ దేశాలు తీవ్రంగా చర్చించాయి. నేరగాళ్లను పట్టుకోవడానికి మరియు సమాచార మార్పిడి వేగవంతం చేయడానికి ‘బ్రైక్స్ నెట్‌వర్క్ ఆఫ్ లా-ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్స్’ ఏర్పాటుకు సభ్యదేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఇది అధికారిక న్యాయపరమైన ప్రక్రియల కంటే వేగంగా, అంతర్జాతీయ స్థాయిలో సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు, పారిపోయిన నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు వీలు కల్పిస్తుందని సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు.
దీనితో పాటు, పారిపోయిన నిందితుల సమాచారాన్ని సేకరించడానికి మరియు విదేశీ ఏజెన్సీలతో కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి రూపుదిద్దుకున్న ‘బ్రిక్స్ రిపాజిటరీ ఆన్ ఇన్ఫార్మల్ కోఆపరేషన్’ ఆవిష్కరణను సభ్యదేశాలు హర్షించాయి. ఈ ప్రాక్టికల్ రిపాజిటరీ ద్వారా ఏ ఏ దేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఏయే నెట్‌వర్క్‌ల ద్వారా శోధించవచ్చో ప్రతి దేశపు ప్రాక్టీషనర్లకు సమగ్ర సమాచారం సులభంగా అందుబాటులోకి వస్తుంది.
విదేశాలకు తరలించిన అవినీతి సొమ్ము మరియు ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే (అస్సెట్ రికవరీ) విధానంలో కూడా ఈ హైదరాబాద్ సమావేశం విప్లవాత్మక పురోగతిని సాధించింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే వివిధ దేశాల చట్ట సంస్థలు ఒకరికొకరు త్వరితగతిన సమాచారం ఇచ్చుకునేలా ఒక ప్రామాణికమైన ఆకృతిని ఖరారు చేశారు. అలాగే బ్రైక్స్ దేశాలలోని సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడేందుకు ‘డైరెక్టరీ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్’ జాబితాను ఆమోదించి, దానిని ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో నవీకరించేలా ప్రణాళిక రూపొందించారు.సదస్సులో భాగంగా “నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ద్వారా నైతిక పాలన” అనే ప్రత్యేక అంశంపై సబ్-సెషన్ నిర్వహించారు. ప్రభుత్వ కొనుగోళ్లలో (డిజిటల్ ప్రొక్యూర్మెంట్) పూర్తిస్థాయి డిజిటల్ విధానాలు తీసుకురావడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, మానవ జోక్యం తగ్గి అవినీతి అవకాశాలు మూతపడతాయని సభ్యదేశాలు అంగీకరించాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ సాధనాల ద్వారా తప్పు జరిగిన తర్వాత పట్టుకోవడం కాకుండా, తప్పు జరగక ముందే రియల్ టైమ్‌లో ముప్పును గుర్తించి నివారించవచ్చని నిపుణులు ఉదాహరణలతో వివరించారు.
అదే సమయంలో ఫిన్‌టెక్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీలు) వినియోగంలో ఉన్న సాంకేతికత వల్ల ఎదురవుతున్న కొత్త రకం సవాళ్లపై కూడా సమావేశం తీవ్రంగా చర్చించింది. డిజిటల్ లావాదేవీలు వేగవంతంగా మరియు సరిహద్దులు లేకుండా జరగడం వల్ల అక్రమ సొమ్మును దాచడానికి, మనీ లాండరింగ్ చేయడానికి నేరగాళ్లు దీనిని వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తమైంది. దీనిని అరికట్టేందుకు స్పష్టమైన, ప్రమాద-ఆధారిత నిబంధనలను బ్రైక్స్ దేశాలు అమలు చేయాలని, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు మరింత వేగంగా డేటాను మార్పిడి చేసుకోవాలని నిశ్చయించారు.హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ రెండు రోజుల అవినీతి నిరోధక సదస్సు, భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో చేపట్టిన ప్రతిపాదనలకు గట్టి పునాది వేసింది.
ఆర్థిక నేరగాళ్లపై ఉమ్మడి పోరాటం, డిజిటల్ సాంకేతికతతో పారదర్శకత, విదేశీ ఆస్తుల పునరుద్ధరణ వంటి అంశాల్లో సభ్యదేశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరిచింది. రాబోయే బ్రిక్స్ అధ్యక్షత్వ బాధ్యతలు చేపట్టే దేశాలు ఈ వేదికను మరింత ముందుకు తీసుకెళ్లి, కార్యాచరణ రూపంలోకి తెచ్చేందుకు ఈ నిర్ణయాలు ఎంతగానో దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.





