ఏఎస్ రావు నగర్ ప్రభుత్వ పాఠశాలలో జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాయ్ ఆఫ్ స్కూలింగ్” కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించడం లక్ష్యంగా జోయాలుక్కాస్ సంస్థ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 13 వేల మంది విద్యార్థులకు విద్యా సహాయాన్ని అందిస్తుండగా, ఏఎస్ రావు నగర్ ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వారి విద్యాభివృద్ధికి సహకరిస్తున్న జోయాలుక్కాస్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, గంప కృష్ణ, జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ మేనేజర్ మిఖిన్, అసిస్టెంట్ మేనేజర్లు సతీష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అండగా జాయ్ ఆఫ్ స్కూలింగ్ కార్యక్రమం.. పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి





