హైదరాబాద్ శివార్లలో అగ్నిప్రమాదాలు

Must read

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల జీడిమెట్ల, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో జరిగిన రెండు భారీ అగ్ని ప్రమాదాలు
నగర భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు కురిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచుతున్న రసాయన పదార్థాలు వల్లే మంటలు చెలరేగినట్లు స్థానికులు వాపోతున్నారు.

జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రాంరెడ్డి నగర్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన సాల్వెంట్ డ్రమ్ముల గోదాంలో ఒక్కసారిగా భారీ అగ్ని చెలరేగాయి. ముందుగా ఇవి చిన్న మంటగా కనిపించిన క్షణంలోనే రూపు మార్చాయి.. ఒక్కసారిగా మంటలు గోదాం మొత్తాన్ని కమ్మేశాయి. అక్కడ నిల్వ ఉన్న కెమికల్ డ్రమ్ములు ఒక్కొక్కటిగా భారీ శబ్దాలతో పేలడం ప్రారంభమైంది. పేలుళ్ల తీవ్రతకు డ్రమ్ములు గాలిలోకి ఎగిరి రోడ్లపై పడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

నల్లటి పొగ అక్కడి ప్రాంతాన్ని కమ్ముకుంది. పొగ దూరప్రాంతాల వరకు వ్యాపించడంతో
ప్రజలు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పిల్లలు, వృద్ధులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. పలు ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి గంటల పాటు పోరాడి మంటలను
అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే గోదాం పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో దుండిగల్ పరిధిలో కూడా మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది. ఈ ఘటనలో కూడా భారీగా మంటలు చెలరేగి సమీప ప్రాంతాలను పొగ కమ్ముకుంది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒకేరోజు రెండు సంఘటనలు జరగడం, అవి కూడా పారిశ్రామిక ప్రాంతాల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ ఘటనల నేపథ్యంలో స్థానికులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గోదాంలపై పర్యవేక్షణ లోపించడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారు తగిన చర్యలు తీసుకుని అక్రమ నిల్వలను తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఈ ఘటనలపై దర్యాప్తు చేపట్టామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!