త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మూడో దశ ప్రారంభం

Must read

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించే దిశగా ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపడుతోంది. రాబోయే కొద్దిరోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మూడో దశను ప్రారంభించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ దశలో దేశంలోని మిగిలిన 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 40 కోట్ల మంది ఓటర్లను కవర్ చేయనున్నట్లు తెలిపారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడడంతో మళ్లీ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది.

ఓటర్ల జాబితాలో పేర్లు సరైనవిగా ఉన్నాయా? చనిపోయిన వారి పేర్లు తొలగించబడాయా? కొత్తగా అర్హత సాధించిన వారికి నమోదు జరిగిందా? చిరునామా మారిన వారి వివరాలు సరిచేయబడాయా? వంటి అంశాలను పరిశీలించే సమగ్ర ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంటారు.

ఈ ప్రక్రియ ద్వారా నకిలీ ఓటర్లు, డూప్లికేట్ నమోదులు, అర్హత లేని పేర్లను తొలగించి, నిజమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల సంఘం అధికారుల వివరాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలోని 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయింది.

ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, బీహార్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే అసోంలో కూడా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పుడు ప్రారంభం కానున్న మూడో దశలో మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని దాదాపు 40 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియలో ఇంటింటి ధృవీకరణ, డిజిటల్ రికార్డుల పరిశీలన, ఆధార్ లింకింగ్, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాల తొలగింపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో డూప్లికేట్ నమోదులు, వలసల కారణంగా మారిన ఓటర్ వివరాలను సరిచేయడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడంలో ఖచ్చితమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాపై వచ్చిన ఆరోపణలు, డూప్లికేట్ ఓటర్ల వివాదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. స్వచ్ఛమైన ఎన్నికల నిర్వహణకు పారదర్శక ఓటర్ల జాబితా అవసరమని, అందుకే ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రాధాన్యం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఓటర్ల జాబితాలో పొరపాట్లు, పేర్లు తొలగింపు, డూప్లికేట్ నమోదులపై గతంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈసారి రాజకీయ పార్టీలు కూడా ఎస్‌ఐఆర్ ప్రక్రియను దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంది. పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు తెలిపే అవకాశముంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!