ఫుకెట్ కేఫ్‌లో కుప్పకూలిన భారతీయులు.. ఒకరి మృతి

Must read

థాయ్‌లాండ్‌లో పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు తీవ్ర విషాదం ఎదురైంది. ఫుకెట్‌లోని ఓ కేఫ్‌లో జరిగిన అనూహ్య ఘటనలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను థాయ్‌లాండ్‌లోని భారత ఎంబ‌సీ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై థాయ్‌లాండ్ స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 9వ తేదీ రాత్రి సమయంలో ఐదుగురు భారతీయ యువకులు కలిసి ఫుకెట్‌లోని కమలా బీచ్ ప్రాంతానికి వెళ్లారు. వీరిలో కుశాగ్ర అగర్వాల్, రాహుల్ అగర్వాల్, అమన్ అగర్వాల్, ఆర్యన్ వర్మ, మరో రాహుల్ ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పర్యటనలో భాగంగా వీరు కమలా బీచ్ సమీపంలోని ఒక కేఫ్‌ను సందర్శించారు.

రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేఫ్‌లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా నలుగురు భారతీయులు అపస్మారక స్థితికి చేరుకుని కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినట్లు కేఫ్ సిబ్బంది గుర్తించినట్లు సమాచారం.

ఘటనను గమనించిన కేఫ్ సిబ్బంది వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్‌లు అక్కడికి చేరుకుని బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఆసుపత్రికి తరలించేలోపే ఒకరు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఘటనపై థాయ్‌లాండ్‌లోని భారత ఎంబ‌సీ స్పందించింది. ఫుకెట్‌లో భారతీయ పర్యాటకులకు సంబంధించిన విషాద ఘటన చోటుచేసుకున్నట్లు ధృవీకరించింది. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు థాయ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, చికిత్స పొందుతున్న వారికి అన్ని విధాల సహకారం అందిస్తున్నామని ఎంబ‌సీ పేర్కొంది.

ప్రస్తుతం ఈ ఘటనకు గల అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఆహార విషబాధా? గ్యాస్ లీకేజా? లేదా మరేదైనా కారణమా? అనే కోణాల్లో థాయ్‌లాండ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కేఫ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌, అక్కడ అందించిన ఆహారం, పానీయాల నమూనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాధితుల వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే ఘటనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!