ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు భాష్యం రామకృష్ణజాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తిగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ లకు భాష్యం రామకృష్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఈ అవకాశం తనకు గౌరవంతో పాటు మరింత బాధ్యతను కూడా తీసుకొచ్చిందన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తనను గుర్తించి దేశ అత్యున్నత శాసనసభల్లో ఒకటైన రాజ్యసభకు అభ్యర్థిగా ఎంపిక చేయడం జీవితంలో మరపురాని ఘట్టమని పేర్కొన్నారు.
తన జీవిత ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న భాష్యం రామకృష్ణ, చిన్ననాటి నుంచి ఎదురైన సవాళ్లను వివరించారు. “నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను. మా అమ్మగారి ప్రేమ, త్యాగం, కష్టాల ఫలితంగానే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం నాకు లభించింది. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ విద్యే జీవితాన్ని మార్చగలదనే నమ్మకంతో ముందుకు సాగాను” అని పేర్కొన్నారు.
విద్యారంగంలో తన ప్రయాణం ఒక ప్రైవేట్ పాఠశాలలో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ఎన్నో సంవత్సరాలు బోధనా రంగంలో సేవలందించినట్లు తెలిపారు. అనంతరం ప్రజల ఆదరణ, విద్యార్థుల విశ్వాసంతో 1993లో ‘భాష్యం’ పేరుతో విద్యాసంస్థను స్థాపించినట్లు వివరించారు.
ప్రారంభంలో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఆ విద్యాసంస్థ, నేడు దక్షిణ భారతదేశంలో ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువల ఆధారిత బోధన లక్ష్యంగా ప్రారంభమైన ఆ సంస్థ ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని చెప్పారు.
విద్యారంగంలో సాధించిన విజయానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందించిన సహకారమే కారణమని భాష్యం రామకృష్ణ తెలిపారు. తన ఎదుగుదలలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజానికి తిరిగి సేవ చేసే అవకాశంగా రాజ్యసభ సభ్యత్వాన్ని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
టీడీపీ తనను రాజ్యసభకు ఎంపిక చేయడం వెనుక విద్యారంగంలో తన అనుభవాన్ని దేశ ప్రయోజనాలకు వినియోగించాలనే ఆలోచన ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విద్య, యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, జాతీయ విద్యా విధానం వంటి అంశాలపై ఆయన రాజ్యసభలో ప్రభావవంతంగా మాట్లాడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





