మోదీపై అభ్యంత‌క‌ర పోస్టులు.. కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం

Must read

దేశ ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చట్టప్రకారం ఫిర్యాదు చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానిపై అసభ్యకర పోస్టుల వ్యవహారంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘మెటా’పై కేసు నమోదు చేసిన డీసీపీ ఆనంద్ బాబును తెలంగాణ ప్రభుత్వం హుటాహుటిన బదిలీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. చట్టానికి బద్ధుడై, విధి నిర్వహణలో రాజ్యాంగం ప్రకారం వ్యవహరించిన ఒక ఐపీఎస్ అధికారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని శిక్షించారని ఆరోపించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రత్యక్ష ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ డీసీపీని బదిలీ చేశారని కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. నిజాయితీగా పనిచేస్తూ, చట్టాన్ని అమలు చేసే అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం వేటు వేస్తోందని ధ్వజమెత్తారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసు వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలికారు. ఇటువంటి చర్యలు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో సోషల్ మీడియా సంస్థలు నిబంధనలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తూ తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు.

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నడుస్తున్న తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వంలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ప్రతిపక్ష నాయకుడిని వెంటనే అరెస్ట్ చేశారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రధానిపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకున్న అధికారులకే శిక్ష పడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. రేపు ఒకవేళ రాహుల్ గాంధీపై ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా ఇదే రీతిలో మౌనంగా ఉండి వదిలేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

తెలంగాణ ప్రాధాన్యత కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే సింగరేణి సంస్థకు తాజాగా మూడు ప్రధాన బొగ్గు బ్లాక్‌లను (కోల్ బ్లాక్స్) కేటాయించామని అధికారికంగా ప్రకటించారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పీకేఓసీ బ్లాక్‌ను సింగరేణి యాజమాన్యానికి నేరుగా కేటాయించినట్లు వివరించారు.

మణుగూరు బొగ్గు బ్లాక్ వేలంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చినప్పటికీ, సింగరేణి సంస్థ భవిష్యత్తును మరియు అక్కడి కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి వివరించారు. నైనీ, తాడిచర్ల బ్లాక్‌-2 తో పాటు మణుగూరు పీకేఓసీ బ్లాక్‌లను సింగరేణికి కేటాయించడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ నూతన బ్లాక్‌ల లభ్యతతో సింగరేణి సంస్థ మళ్లీ లాభాల బాట పట్టి, నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో పాలించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను తమ స్వార్థ రాజకీయాల కోసం పూర్తిగా దోచుకున్నాయని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరు పార్టీల పాలనలో నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం వల్ల సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని చెప్పారు. అయితే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం సింగరేణి మనుగడకు, తెలంగాణ కార్మికుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సంస్థ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!