వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా ఒక టీడీపీ కార్యకర్త ఇంటిపై పడి దౌర్జన్యంగా దాడి చేస్తే, ఆ అరాచకాన్ని సమర్థిస్తూ జగన్ మాట్లాడటం అత్యంత శోచనీయమని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తే, దానిని ఖండిస్తూ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్టు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఎవరి ఇళ్ల మీద పడి దాడి చేసినా సరే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఖాళీగా ఉండాలా అని ఆయన నేరుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి ఒక చట్టం, సామాన్యుడికి మరొక చట్టం ఉండదని జగన్ తెలుసుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందంటూ తన సొంత అవినీతి పత్రికలో జగన్ అబద్ధపు కథనాలు రాయిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. నిజానికి అరాచక పాలనకు పేటెంట్ రైట్స్ ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల కాలంలో ఆయన సాగించిన రౌడీ రాజ్యం ఎలాంటిదో రాష్ట్ర ప్రజలందరూ కళ్లారా చూశారని గుర్తుచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వేలు ఎత్తి చూపే ముందు, మిగిలిన నాలుగు వేళ్లు తన వైపే చూపిస్తున్నాయనే విషయాన్ని జగన్ గ్రహించాలని సూచించారు. గతంలో ఆయన సాగించిన అరాచకాలను తట్టుకోలేకే ప్రజలు వైసీపీని 151 సీట్ల నుంచి ఏకంగా 11 సీట్లకు దించి మూలన కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో టీడీపీ అరాచక పాలన సాగిస్తోందంటూ జగన్ ట్వీట్ చేయడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని బుద్ధా వెంకన్న విమర్శించారు. అరాచకానికి నిదర్శనం జగన్ అయితే, అభివృద్ధికి అసలైన ప్రతిరూపం చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్యానించారు. ఒకరి ఇంట్లోకి అక్రమంగా చొరబడి దాడి చేసి, విలువైన వస్తువులను ధ్వంసం చేసిన స్పష్టమైన వీడియో సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు కారు యాక్సిడెంట్ చేసి ఒక అమాయక వ్యక్తి మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు. సొంత కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, కేసు సాక్ష్యాలను తారుమారు చేయడానికి సీదిరి అప్పలరాజు ప్రయత్నించారని, బాధితుడి కుటుంబాన్ని బెదిరించారని మండిపడ్డారు.
సాక్షులను బెదిరించినా, సాక్ష్యాలు లేకుండా చేయడానికి కుట్రలు పన్నినా చట్టప్రకారం కేసులు నమోదువుతాయనే కనీస జ్ఞానం కూడా జగన్‌కు లేకపోవడం విచారకరమని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్ అసలైన బీసీ ద్రోహి అని చెప్పడానికి మృతుని కుటుంబాలను బెదిరించిన వారికి అండగా నిలబడటమే నిదర్శనమని ధ్వజమెత్తారు. సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారిని, చనిపోయిన వారి కుటుంబాలను వెళ్లి పరామర్శిస్తారని, కానీ హత్యలు, దాడులు చేసిన వారి ఇంటికి వెళ్లి ఓదార్చే విచిత్రమైన నైజం ఒక్క జగన్‌కే చెల్లుతుందని తీవ్రంగా విమర్శించారు. ఒక పేద కుటుంబంలో వ్యక్తి చనిపోతే కనీసం మానవత్వంతో సానుభూతి కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలించిన ఐదేళ్ల కాలంలో బీసీ వర్గాలకు ఏ మేలు చేశారో ధైర్యంగా బయటకు వచ్చి చెప్పే దమ్ము జగన్‌కు ఉందా అని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియపై జగన్ చేసిన అనవసరపు విమర్శలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, దమ్ముంటే నేరుగా చర్చకు రావాలని ఆహ్వానిస్తే.. జగన్ ముందుకు రాలేకపోతున్నారని విమర్శించారు. “నీకు ధైర్యం లేక నీ చెంచాలతో మాట్లాడిస్తున్నావా? నిజంగా చర్చకు వచ్చే దమ్ము నీకు ఉంటే బయటకు రా, లేదా అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై ప్రశ్నించు” అని డిమాండ్ చేశారు.కనీసం విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్.ఐ అని కూడా చూడకుండా వైసీపీ నాయకులు దాడికి యత్నిస్తే, జగన్ కనీసం ఆ ఘటనను ఖండించకపోవడం ఆయన మనస్తత్వానికి అద్దం పడుతోందన్నారు. ఐదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు ఏ అంశంపైనా కనీస అవగాహన లేకపోవడం విచారకరమని, ఆయన కంటే సామాన్యులకే ఎక్కువ పరిజ్ఞానం ఉందన్నారు. వేలాది మంది యువత, నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న డీఎస్సీ లాంటి అంశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.గతంలో తమ ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చివరకు చంద్రబాబు నాయుడి వంటి అగ్రనేతలను అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేయించిన నల్లటి చరిత్ర జగన్‌దని గుర్తుచేశారు. జగన్ పాలనలోని వేధింపులు తాళలేక నాటి డీజీపీలే పనిచేయలేమని చెప్పి పారిపోయిన పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లపై నిరంతరం విషం కక్కడం మానుకోవాలని బుద్ధా వెంకన్న హితవు పలికారు.





