అమిత్ షా జవాబ్ దో’.. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన హోరు

Must read

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు వరుసగా గైర్హాజరు కావడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో విపక్షాల కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీఛార్జ్, అయోధ్య రామాలయ విరాళాల చోరీ వంటి కీలక అంశాలపై హోంమంత్రి తక్షణమే సభకు వచ్చి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌లతో పాటు పలువురు విపక్ష ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. “అమిత్ షా పార్లమెంట్‌కు ఎందుకు రావడం లేదు?”, “అమిత్ షా జవాబ్ దో” వంటి ప్రశ్నలతో కూడిన భారీ బ్యానర్లను, ప్లకార్డులను చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. అయోధ్య రామమందిర నిధుల చోరీని ఎత్తిచూపుతూ “చందా చోర్- గద్దీ చోడ్” అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.

పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేయడం, పెల్లెట్ తుపాకులు గురిపెట్టడంపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ట్రస్ట్ ఉన్నప్పటికీ, శ్రీరామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలు ఎలా చోరీకి గురయ్యాయో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయాలన్నారు.

ఈ నిరసనలో రాహుల్ గాంధీ, మహువా మొయిత్రా, సుప్రియా సూలే, సంజయ్ రౌత్ వంటి పలువురు అగ్రనేతలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. జులై 20న విద్యార్థులు చేపట్టిన ‘సంసద్ ఛలో’ కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం వల్ల విద్యార్థులు, పోలీసులు గాయపడిన ఘటనపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి.

మరోవైపు రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై విపక్షాలు వినూత్న నిరసనలు తెలుపుతున్నాయి. పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ ఒక సాధువు వేషధారణలో పార్లమెంట్ ఎదుట వ్యంగ్యాత్మక స్కిట్ వేయగా, అందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ ఘటన తదనంతరం పప్పు యాదవ్‌పై దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో, సోమవారం నాటి 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.ఈ విమర్శల హోరు నడుమ కేంద్ర ప్రభుత్వం ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (ఎఫ్​సీఆర్​ఏ) సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.

అయితే ఈ ఎఫ్​సీఆర్​ఏ సవరణ బిల్లుపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. బిల్లు వచ్చినా రాకపోయినా, విద్యార్థులపై జరిగిన దాడులు, హోంమంత్రి గైర్హాజరుపై తమ నిరసనలు, ఒత్తిడి కొనసాగుతాయని స్పష్టం చేశారు.ప్రజా సమస్యలపై హోంమంత్రి ప్రకటన చేసే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని, ఉభయ సభల్లోనూ ఇదే అంశంపై నిరసనలు వ్యక్తమవుతాయని ప్రతిపక్ష నేతలు తెగేసి చెప్పారు. విపక్షాల వరుస నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!