బిఆర్ఎస్ పాలనలో అప్పుచేస్తే..కాంగ్రెస్ పాల‌న‌లో ఇళ్లు మంజూరు చేశాం:మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Must read

రాష్ట్రంలో గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌దేళ్ల కాలంలో ఎనిమిదిన్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయిల అప్పును ప్ర‌జ‌ల‌పై మోపితే నేటి కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం రెండున్న‌ర ఏళ్లలో ఎనిమిది ల‌క్ష‌ల ఇళ్ల‌ను మంజూరు చేసింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. తొలి విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కం కింద 4.50 ల‌క్ష‌ల ఇళ్ల‌ను మంజూరు చేయ‌గా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల‌కు రెండున్న‌ర ల‌క్ష‌ల ఇళ్లు, క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్ల‌తో క‌లిపి మొత్తం ఎనిమిది ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మిస్తోంద‌ని వివ‌రించారు.

వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల జిల్లాల్లో బుధ‌వారం స‌హ‌చ‌ర మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, వాకీటి శ్రీ‌హ‌రి, స్ధానిక ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి కృష్ణారెడ్డిల‌తో క‌లిసి త‌హ‌శీల్ధార్ కార్యాల‌య భ‌వ‌నం, వెంక‌టేశ్వ‌ర ఆల‌యాల‌కు మంత్రి పొంగులేటి శంకుస్ధాప‌న చేశారు. అనంతరం ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కం కింద పేద‌ల‌కు మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన స‌భ‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి దివంగ‌త నేత రాజ‌శేఖ‌రరెడ్డి 77వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా తాము ప్ర‌జ‌ల‌ను మోస‌పుచ్చ‌కుండా ఇచ్చిన హామీల‌ను అమలు చేస్తున్నామ‌న్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ‌కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయ‌ని గుర్తు చేశారు.

తొలి విడ‌త మంజూరు చేసిన ఇళ్ల‌లో ఇప్ప‌టికే 1.35 ల‌క్ష‌ల ఇళ్ల గృహ‌ప్ర‌వేశాలు జ‌రిగాయ‌ని మ‌రో 1.25 ల‌క్ష‌ల ఇళ్లు శ్లాబుల‌ను పూర్తి చేసుకోగా మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. రెండ‌వ విడ‌త ఇళ్ల మంజూరు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 1500 ఇళ్లతో పాటు పూరి గుడిసెల స్ధానే ప‌క్కా ఇళ్ల కోసం 500 చొప్పున మంజూరు చేశామ‌ని వివ‌రించారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో సాగ‌తున్న ప్ర‌గ‌తిని చూసి ఓర్వ‌లేక బిఆర్ఎస్ నాయ‌కులు రోడ్ల‌పై ప‌డి విషం చిమ్ముతున్నార‌ని , మతి భ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఈనెల 10 ఖ‌మ్మం జిల్లాలో రైతుల‌కు 9300 కోట్ల రూపాయిల విడుద‌లకు సంబంధించి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని నాడు వ‌రి వేస్తే ఉరి అన్న కేసీఆర్ మాట‌ల‌కు భిన్నంగా నేడు రైతే రాజు అనే నినాదంతో కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం ముందుకు సాగుతోందన్నారు.

వ‌న‌ప‌ర్తిని ద‌త్త‌త తీసుకుంటాన‌ని గ‌తంలో ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని మంత్రి పొంగులేటి వివ‌రిస్తూ ఇక్క‌డ ప్రెస్ క్ల‌బ్ కు భ‌వ‌నాన్ని, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య భ‌వ‌నాన్ని మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో సుమారు 32వేల పూరి గుడిసెలు ఉన్న‌ట్లు గుర్తించామ‌ని వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా ఇందిర‌మ్మ ఇళ్లు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మించుకునే పేద‌ల‌కు ఇసుక‌, మ‌ట్టి సేక‌ర‌ణ‌ విష‌యంలో ఎటువంటి ఆటంకం క‌లిగించ‌వ‌ద్ద‌ని పోలీసు, రెవెన్యూ, హౌసింగ్ అధికారుల‌కు సూచించారు. సాదాబైనామాల‌కు సంబంధించి రైతు పొజిష‌న్ లో ఉంటే వాటిని రెగ్యుల‌రైజ్ చేయాల‌ని దీనికి సంబంధించి అవ‌స‌ర‌మైతే సిసిఎల్ఎ అనుమ‌తి తీసుకోవాల‌ని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!