ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ నాలుగో రోజు పోటీల ముగింపు కార్యక్రమానికి జాతీయ ఫెన్సింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఆహ్వానం మేరకు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో సన్స్‌ద్ ఉత్సవ్ వంటి కార్యక్రమాల ద్వారా గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో క్రీడా విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. ఈ కార్యక్రమాలు దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాయని అన్నారు.
30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపియన్లు సహా ఆసియా ఖండంలోని ప్రముఖ ఫెన్సర్లతో భారత క్రీడాకారులు పోటీపడటం దేశంలో ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న జాతీయ ఫెన్సింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, నిర్వాహకులు, ఇతర సహాయక సిబ్బందిని రఘునందన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నాలుగో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు ప్రదానం చేశారు.
భారత యువతలో ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందారని అన్నారు. క్రీడలను కేవలం వినోదంగా కాకుండా వృత్తిపరమైన అవకాశంగా కూడా యువత స్వీకరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఫిట్ ఇండియా’ ఉద్యమం దేశ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిందని ఆయన తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు, వ్యాయామం, శారీరక దృఢత్వం అత్యంత అవసరమని ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం దేశవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపిందన్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వృద్ధులు సైతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ఈ కార్యక్రమం ప్రేరణనిచ్చిందని చెప్పారు.
ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ వంటి అంతర్జాతీయ స్థాయి పోటీలను భారత్ విజయవంతంగా నిర్వహించడం దేశ క్రీడా సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ల నిర్వహణలో భారత్ తన ప్రతిభను చాటుకుంటోందని చెప్పారు. ఈ తరహా పోటీలు భారత క్రీడాకారులకు అంతర్జాతీయ అనుభవాన్ని అందించడమే కాకుండా, దేశ ప్రతిష్ఠను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.
‘ఖేలో సన్స్‌ద్ ఉత్సవ్’ ద్వారా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించే అవకాశం లభించిందని రఘునందన్ రావు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు.ఈ నెల 19న ప్రారంభమైన ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జూన్ 24న ముగియనున్నాయి.





