కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్ తో సీఎం భేటీ

Must read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు.

విభజన అంశాలతో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల్ని మంజూరు చేయాలని ఆయన కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమైన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు.

2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేశారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే తాను స్వయంగా 5 మార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు వెల్లడించారు.

2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని.. గ్యాప్ 1, గ్యాప్ 2 లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జల శక్తి మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు.

సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దాని కంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు సీఎం తెలియచేశారు. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయినట్టు లేఖలో వెల్లడించారు. కాలువల సామర్ధ్యం పెంచిన మేరకు నిధులను రీఎంబర్సు చేయాలని జల శక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

ప్రధాన మంత్రి కృషి సీంచాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు కోరుతూ మరో లేఖను ముఖ్యమంత్రి అందించారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కోరారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!