పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ తన హోదాలకు తగిన విధంగా హుందాగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించకుండా..కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విధ్వేషాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడమేమిటని నిలదీశారు.
ఈ మేరకు బుధవారం రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తనకు వచ్చిన సమాచారం ఆధారంగా..ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ డాక్టర్ కె.నాగేశ్వర్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కేంద్రంలోని అమిత్‌షాను పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి చర్చించిన అంశాల్ని వెల్లడించారని గుర్తుచేశారు. అదే సమయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ తనకు మిత్రులేనని చెప్పిన విషయాల్ని ఆయన ప్రస్తావించారన్నారు.
అది వాస్తవం కాకపోతే..దానిపై బీజేపీ వాళ్లుగానీ, జనసేనగానీ అదే మీడియా వేదికగా ఖండించవచ్చని సూచించారు. ఆ అంశాన్ని మరింతంగా పెంచి..పోషించి చివరకు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కాకినాడ తదితర పోలీస్టేషన్లలో కేసులు పెట్టడం…ప్రజాస్వామ్యం అన్పించుకుంటుందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు ఖండించారని, నిరసనలూ చేశారన్నారు. ఈ వ్యవహారం చినికి..చినికి మరింతగా పెరిగి..తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేధాలు సృష్టించేంత పరిస్థితికి దారితీసిందన్నారు.
తెలంగాణలోని కొందరు పవన్ కల్యాణ్ వైఖరిని అవకాశంగా తీసుకుని తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వ్యవహారం అంతటితో ముగిసిందని అనుకునేలోగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు..హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ మీడియా సమావేశం పెట్టి..అక్కడ ఆవేశ పూరితంగా ప్రసంగించడం అగ్గిపై ఆజ్యం పోసినట్లయిందని తెలిపారు. దానికి ప్రతిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు, ఆ పార్టీ నాయకులు గట్టిగా బదులీయడంతో పవన్ మీడియా సమావేశం వివాదస్పదమైందన్నారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు కలసి మెలసి పనిచేస్తున్నారని, మీరు రాజకీయాల కోసం ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచి పోషించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కమ్యూనిజం చచ్చిపోయిందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవాళ చైనా, వియాత్నం, క్యూబా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉందని, మరో 150 దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాయన్నారు.
ఏదైనా ఒక రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటమితో కమ్యూనిస్టులపై ఈ తరహాగా వ్యాఖ్యలు సరికాదన్నారు. శ్రమ జీవులు ఉన్నంత కాలం కమ్యూనిజం పోరాటం కొనసాగుతుందని, ఆ విషయాన్ని పవన్ గుర్తెరగాలని సూచించారు. పవన్ కల్యాణ్ ప్రాంతీయ వాదం విపరీతంగా పెరిగిపోతుందని, దీనిపై కేంద్రం పెద్దలు జోక్యం చేసుకోవాలనే చెప్పే ముందు…ముందు దేశ వ్యాప్తంగా మత చిచ్చు పెట్టి..మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న మోదీతో సెక్యులర్ పార్టీగా ఉన్న నీవు ఎలా జతకట్టావంటూ నిలదీశారు.
ఒక వైపు సనాతన ధర్మం వాదంతో ముందుకెళ్తున్న పవన్‌కు…గద్దర్ విగ్రహాన్ని పెట్టే నైతిక హక్కులేదన్నారు. పవన్ వ్యాఖ్యలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంటాయని, బాధ్యతల్ని విస్మరించి తెలుగు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టే విధానాలతో ప్రసంగించడం సరికాదని, తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రితోపాటు పంచాయతీరాజ్, పర్యావరణం, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలకు బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్‌కు..ఏపీలో ఎన్నో పనులు చేసుకోవడానికి, తన పార్టీ బలోపేతానికి అవకాశముందని తెలిపారు. వాటిని విస్మరించి బీజేపీ అజెండాను భుజాన మోసుకుని వెళ్లడం తగదన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన వైఖరిని మార్చుకుని..బాధ్యతగా వ్యవహరించాలని రామకృష్ణ హితవు పలికారు.





