డిహైడ్రేషన్​ తగ్గాలా.. గోరువెచ్చటి నీటిలో ఉప్పు, చక్కెర కలిపి తీసుకోండి

Must read

వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్, అతిసారం, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు, నీరసం, జ్వరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తునే ఉంటాయి. ఈ సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎండలో ఎక్కువసేపు గడపడం, తగినంత నీరు తాగకపోవడం, తీవ్ర శారీరక శ్రమ చేయడం వంటి కారణాల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలోనే శరీరం అలసటగా అనిపించడం, తలనొప్పి, తల తిరగడం, చెమటలు తగ్గిపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత విషమించవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో తక్షణ ఉపశమనం కోసం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక సహజ పరిష్కారం ఉంది. ఉప్పు. పంచదార మిశ్రమం (హోమ్‌మేడ్ ORS) శరీరానికి అవసరమైన ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు తిరిగి అందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వైద్యపరంగా కూడా సమర్థవంతమైన ప్రాథమిక పరిష్కారంగా భావించబడుతుంది.

ఈ మిశ్రమాన్ని తయారు చేయడం చాలా సులభం. ఒక లీటర్ శుభ్రమైన నీటిలో అర టీస్పూన్ ఉప్పు, ఆరు టీస్పూన్లు పంచదార కలిపి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని కొద్దికొద్దిగా తాగడం ద్వారా శరీరంలో నీటి లోపం తగ్గి, శక్తి తిరిగి వస్తుంది. ముఖ్యంగా ఎండలో పనిచేసే వారు, పిల్లలు, వృద్ధులు ఈ ద్రావణాన్ని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, ఇది ప్రారంభ దశలో మాత్రమే ఉపశమనం కలిగించే చిట్కా అని గుర్తుంచుకోవాలి. వడదెబ్బ తీవ్రంగా ఉంటే, వాంతులు, అధిక జ్వరం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించడం అవసరం.

ఇక వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లడం తగ్గించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవాలి. తగినంత నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!