విశాఖ స్టీల్ ప్లాంట్లో సంభవించిన ఘోర ప్రమాదం విషాదాన్ని నింపిన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి బాధిత కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని లోకేష్ తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు వేగవంతం చేసిందన్నారు. గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంబంధించి అత్యంత కీలకమైన ప్రకటనను లోకేష్ చేశారు. గతంలో ఎన్నడూ అమలు చేయని విధంగా, ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగి, పర్మనెంట్ ఉద్యోగి అనే తేడా ఉండదని స్పష్టం చేశారు. ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ఒకే విధమైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
“ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు. కుటుంబానికి దీర్ఘకాలిక భరోసా కల్పించే చర్య. తమ కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి భవిష్యత్తులో జీవనోపాధి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది” అని లోకేష్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, వారికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన ఓ సంఘటనను లోకేష్ ఉద్వేగంగా తెలియజేశారు. “గాయపడిన శ్రీనివాస్ అనే కార్మికుడిని పరామర్శిస్తే, ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా ‘అయ్యా, మమ్మల్ని కాదు, దయచేసి విశాఖ ఉక్కును కాపాడండి. లక్షలాది కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి’ అని వేడుకున్నాడు. ఆ మాటలు కార్మికులకు ఫ్యాక్టరీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశాయి. ఆయన మాటలు నన్ను కదిలించాయి” బావోద్యేకంగా ఆయన తెలిపాడు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రమాద ఘటనపై ప్రత్యేకంగా స్పందించారని లోకేష్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర మంత్రి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అదనంగా రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరటనిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయంతో పాటు కేంద్రం అందిస్తున్న ఈ ప్రత్యేక ఎక్స్గ్రేషియా ద్వారా కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితుల పునరావాసానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
ఉద్యోగాల అంశంపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిన చర్చల వివరాలను కూడా లోకేష్ వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగం కల్పించే విషయంలో కొన్ని పరిపాలనా నిబంధనలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రస్తావించినప్పటికీ, కేంద్ర మంత్రి కుమారస్వామి దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు.
“కుటుంబంలో విద్యార్హతలు కలిగిన వ్యక్తికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏవైనా నిబంధనల సమస్యలు ఎదురైతే, అవసరమైతే ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లి అయినా పరిష్కరిస్తాను. ఇది నా వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నాను” అని కుమారస్వామి పేర్కొన్నట్లు లోకేష్ వివరించారు. కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు బాధిత కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తించాయని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోని ప్రముఖ ఉక్కు పరిశ్రమల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని, అక్కడ పనిచేసే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.





