తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చే దిశగా మరో కీలక అడుగు పడింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బొర్పట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన థెరానైమ్ బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ముఖ ఔషధ సంస్థ ‘అరబిందో ఫార్మా’కు చెందిన పూర్తి స్థాయి అనుబంధ విభాగమైన థెరానైమ్ బయోలాజిక్స్, దాదాపు రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ అత్యాధునిక ప్లాంట్‌ను నిర్మించింది. ఈ భారీ ప్లాంట్ ఏర్పాటు ద్వారా స్థానిక ప్రాంతానికి చెందిన 1,500 మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
ఈ బయోలాజికల్ ప్లాంట్‌లో క్యాన్సర్ (Cancer) ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అత్యాధునిక బయోలాజిక్స్, జీవ రసాయన మందులను తయారు చేయనున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే నాణ్యమైన ఔషధాలను అమెరికా (USA) సహా పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. “మేడ్ ఇన్ తెలంగాణ” బ్రాండ్ ప్రతిష్టను ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
థెరానైమ్ సంస్థ గ్లోబల్ ఫార్మా దిగ్గజం MSD (Merck Sharp & dosage) సింగపూర్ విభాగంతో కుదుర్చుకున్న మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ (MSA) లో భాగంగా ఈ కాంట్రాక్ట్ బయో-మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. ఈ ఫెసిలిటీలో అత్యాధునిక మేమాలియన్ సెల్ కల్చర్ బయోరియాక్టర్లతో పాటు, ఏడాదికి సుమారు 2.5 నుంచి 3 కోట్ల (25-30 మిలియన్) వయల్స్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఐసోలేటర్ లైన్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫార్మా రంగ పెట్టుబడులకు తెలంగాణ ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యతగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి డి. శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.





