మహారాష్ట్రలో ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి

Must read

మహారాష్ట్రాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సంగిల్​ జిల్లాలోని జత్ తహసీల్ పరిధిలో ఉన్న మోతేవాడి గ్రామంలోని మర్గుబాయి దేవి దేవాలయం వద్ద మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

ప్రతి సంవత్సరం నిర్వహించే మర్గుబాయి దేవి జాతర సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది భక్తులు జాతరలో పాల్గొనడానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం వరకు జాతర ఉత్సాహంగా కొనసాగుతుండగా, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

సాయంత్రం సమయంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆకస్మికంగా కుండపోత వర్షం మొదలవడంతో అక్కడున్న భక్తులు రక్షణ కోసం ఆలయ ప్రాంగణంలోని గోడ పక్కన, రేకులతో నిర్మించిన షెడ్డు కిందకు చేరుకున్నారు. అయితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ గోడ, షెడ్డు ఒక్కసారిగా కూలిపోయి అక్కడున్న వారిపై పడింది.

ఈ ప్రమాదంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా అరుపులు, ఆర్తనాదాలు మార్మోగాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, కూలిన గోడల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ప్రమాద సమయంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 350 మంది భక్తులు ఉన్నారు. గోడ కూలిన ప్రాంతంలో ఎక్కువ మంది ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

మృతుల్లో ముగ్గురు స్థానిక మహారాష్ట్ర వాసులుగా గుర్తించగా, మరో ముగ్గురు కర్టాటకలోని బీజాపూర్ తాలూకాకు చెందిన భక్తులని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం.

ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని కొందరు ఆరోపిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తాత్కాలిక నిర్మాణాల భద్రతపై సరైన పరిశీలన జరగలేదని అంటున్నారు.

ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు కారణంగా ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఆకస్మిక వర్షాలు, బలమైన గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా భారీ జనసమ్మర్థం ఉండే ఆలయాలు, జాతరలు, బహిరంగ కార్యక్రమాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!