తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతి దేవాలయంను సందర్శించి పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మనవడు రియాన్ష్ (రుద్రదేవ్)కు అక్షరాభ్యాసం చేయించడం విశేషంగా నిలిచింది. భక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది.
ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బాసరకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలయానికి చేరుకున్న వెంటనే వేదపండితులు ముఖ్యమంత్రికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంగళవాయిద్యాల మధ్య సీఎం కుటుంబం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అనంతరం వారు సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరంమనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు. హిందూ సంప్రదాయంలో విద్యారంభానికి ప్రతీకగా భావించే ఈ కార్యక్రమాన్ని అమ్మవారి సాక్షిగా నిర్వహించడం విశేషం. చిన్నారి చేతులతో మొదటి అక్షరాలను రాయించడం ద్వారా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తి భావన మరింత ఉట్టిపడింది.
ఇక ఆలయ అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిపూజ చేశారు. ఈ పనులు పూర్తయ్యాక భక్తులకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. పార్కింగ్, త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వారు సమాచారం ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం రాష్ట్రానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగినదని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం నిర్వహిస్తారని, అందుకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
అలాగే విద్య ప్రారంభానికి బాసర క్షేత్రం ఒక విశిష్ట స్థలం అని పేర్కొన్నారు. చిన్నారులు విద్యలో రాణించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షింస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





