వికారాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. పెద్దేముల్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల్లోకి వెళితే, జహీరాబాద్‌కు చెందిన కవిరాజ్ (40), ఆయన భార్య పావని (35) తమ ఇద్దరు పిల్లలు కీర్తన (11), కార్తీక్ (13)తో కలిసి ఆదివారం రుక్మాపూర్ గ్రామానికి వెళ్లారు. మే 1న పావని సోదరుడి వివాహం జరగనున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుక ఏర్పాట్లలో పాల్గొనేందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన అనంతరం సాయంత్రం తిరిగి తమ స్వగృహమైన జహీరాబాద్‌కు బయలుదేరారు.
తిరుగు ప్రయాణంలో నలుగురు కలిసి స్కూటీపై ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో తట్టెపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో కవిరాజ్, పావని, వారి కుమార్తె కీర్తన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినా కుమారుడు కార్తీక్ ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ వైద్యులు శ్రద్ధగా చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారి ఇంటిలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో దుఃఖ వాతావరణం నెలకొంది.
లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళనకు గురి చేసింది. చిన్నపిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబం ఇలాంటి ప్రమాదానికి గురవడం దురదృష్టకరమని స్థానికులు దు:ఖితులయ్యారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన సహాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.





