పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి నేడు ముగింపు పలికిన సందర్భంగా నిర్వహించిన భారీ సభలో పాల్గొన్న ఆయన, ప్రజల స్పందనను చూస్తుంటే విజయం తమదేనని స్పష్టంగా తెలుస్తోందన్నారు. మళ్లీ ఈ రాష్ట్రానికి వచ్చేది భాజపా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
బెంగాల్‌లోని బ్యారక్ పోర్ లో నిర్వహించిన సభలో మాట్లాడిన ప్రధానమంత్రి, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. ప్రజలందరికీ మిఠాయిలు పంచుతూ విజయోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదే ఉత్సాహంతో నేడు తాను ఇక్కడి నుంచి వెళ్తున్నానని, ప్రజల ఆశీర్వాదమే తమకు బలమని అన్నారు.
ప్రచారానికి చివరి రోజు ప్రజల నుంచి వచ్చిన స్పందన తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని మోదీ తెలిపారు. తాను హెలిప్యాడ్ వద్ద దిగినప్పటి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రహదారి ఇరువైపులా ప్రజలు నిలబడి స్వాగతం పలికారన్నారు. వేలాదిమంది తనను ఆశీర్వదించడానికి వస్తారని తాను ఊహించలేదని, ఈ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత భాజపాలో ఒక సాధారణ కార్యకర్తగా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించానని ప్రధాని వివరించారు. ఎన్నికల బాధ్యతలు స్వీకరించడం కూడా అదే క్రమంలో భాగమని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా కుటుంబం అంటూ ఏదీ లేదని, దేశ ప్రజలే తన కుటుంబమని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలే తనకు ప్రేరణగా ఉంటాయని పేర్కొన్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నానని మోదీ చెప్పారు. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందన్నారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించే రహదారి ప్రదర్శనలను తాను పుణ్యయాత్రలుగా భావిస్తానని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడం తనకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిలా ఉంటుందని తెలిపారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణముల్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు తన అసలు సిద్ధాంతాలను విస్మరించిందని ఆరోపించారు. “మా-మాటి-మనుష్” అనే నినాదంతో ప్రజలను ఆకర్షించిన నేతలు ఇప్పుడు ఆ నినాదాన్నే ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.





