తెలంగాణలో ఇంధన సెగ

Must read

తెలంగాణ వ్యాప్తంగా ఇంధన కొరత సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో గత రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ముఖ్యంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర పనులపై బయటకు వచ్చే వారు ఇంధనం దొరకక సతమతమవుతున్నారు. స్టాక్ ఉన్న ఒకట్రెండు బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వేచి ఉన్నా ట్యాంకులు నిండటం లేదని జనం ఆవేదన చెందుతున్నారు. కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా సిఎన్‌జి స్టేషన్ల వద్ద కూడా ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

జిల్లాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 12 బంకులు ఇంధనం లేక మూతపడ్డాయి. దీనివల్ల రవాణా రంగం పూర్తిగా స్తంభించింది. లారీలు, ట్రాక్టర్లు రోడ్డు పక్కనే ఆగిపోయాయి.

ముఖ్యంగా ప్రస్తుతం పంట కోతల సమయం కావడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వరి కోత యంత్రాలు, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలకు డీజిల్ దొరక్కపోవడంతో వ్యవసాయ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పొలాల్లో ఉన్న పంటను ఇంటికి చేర్చుకోవడంలో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

క్రషర్ మిల్లులు, ఇతర పారిశ్రామిక అవసరాలకు డీజిల్ అందకపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో బంకులు మూతపడుతుంటే, మరోవైపు పౌర సరఫరాల శాఖ అధికారులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరుతున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!