బీఆర్ఎస్ ఒక చ‌చ్చిన శవం :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Must read

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆ పార్టీని ఒక ‘సచ్చిన శవం’తో పోల్చారు. ఏ లక్ష్యంతోనైతే ఆ పార్టీ పుట్టిందో ఆ అవసరం ఇప్పుడు తీరిపోయిందని, ఇకపై దానికి రాజకీయ భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు.

పదేళ్ల అధికార గర్వంతో కల్వకుంట్ల కుటుంబం ప్రజలకు దూరమైందని, అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, అసలు ఉన్న బీఆర్ఎస్ పార్టీనే నిలబడుతుందా లేదా అనే స్థితిలో ఉందని సెటైర్లు వేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ కూటమి, బీజేపీ-బీఆర్ఎస్ అంతర్గత కూటమి మధ్యే సాగుతుందని జోస్యం చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రభుత్వ విధానం సరైనదేనని వెల్లడైందని ఆయన పేర్కొన్నారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకాన్ని చట్టవిరుద్ధమని చెప్పడానికి కోర్టు నిరాకరించిందని, ప్రభుత్వం జారీ చేసిన జీవో యధాతథంగా కొనసాగుతుందని గుర్తు చేశారు. కేవలం నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని మాత్రమే కోర్టు సూచించిందని, ఇది కేసీఆర్ లేదా హరీష్ రావుకు లభించిన విజయం కాదని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరగాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము త్వరలోనే ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలిసి పూర్తి వివరాలు అందజేస్తామని, కేంద్రం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తామని హెచ్చరించారు.

బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని కాళేశ్వరంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని, బండి సంజయ్ వంటి వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!