కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనుదామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు దేశం అంతా ఒక్కటే పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరూ కలిసి జరుపుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. ఈ రోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరి గుండె చప్పుడు. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడ విద్యార్థులను చూసిన తర్వాత నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అనగానే స్కూల్ లో హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి క్లాస్ రూమ్స్, స్కూల్ ని డెకరేట్ చేసేవాళ్లం.
స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర గురించి స్టడీ చేసేవాళ్లం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవి. జనగణమన అంటూ జాతీయ గీతం పాడుతూ.. జాతీయ జెండా ఎగరడం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈ రోజు మళ్లీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైనే కాదు.. ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది.
దేశభక్తి ఎంత ముఖ్యమో.. రాష్ట్ర భక్తి కూడా అంతే ముఖ్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. 1965, ఆగష్టు 9న మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. ఒక చిన్న మత్స్యకార దేశం. మన రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు కూడా లేవు. కానీ ఒక నాయకుడు ఆ దేశ చరిత్రను మార్చారు. ఆయనే అప్పటి సింగపూర్ ప్రధానమంత్రి లీ క్వాన్ యూ. మనం నిలబడదాం, ఈ దేశాన్ని మనమే స్వయంగా నిర్మించుకుంటాం అని లీ క్వాన్ యూ అన్నారు. ఆయన దేశ ప్రజలకి కొన్ని విషయాలు చెప్పారు.
ఇతరులను నిందించడం ఆపాలని, మరింత కష్టపడి పనిచేయాలని, క్రమశిక్షణతో ఉండాలని, దీర్ఘకాలికంగా ఆలోచించాలని, మీ దేశంపై విశ్వాసం ఉంచాలని, అందరం కలిసి దేశాన్ని నిర్మిద్దామని చెప్పారు. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తే.. ఇప్పుడు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే తక్కువ జనాభా ఉన్న 28వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అలాంటి గొప్ప ఆలోచనలు ఉన్న నాయకత్వం మనకి కూడా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో గౌరవ సీఎం చంద్రబాబు గారు మనకోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.
ఒక చిన్న దేశం అద్భుతాలు చేసినప్పుడు.. మనం చేయలేమా? ఇంకెంత కాలం మనం ఉద్యోగాలు, ఉపాధి కోసం వేరే రాష్ట్రాలు వెళ్లాలి? సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుని మనం అభివృద్ధి చెందుదాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అభివృద్ధి నాలో కసి పెంచుతుంది. కేవలం హైదరాబాద్ చెన్నై కాదు.. ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి ఉంది. మన ముఖ్యమంత్రి గారికి విజన్ ఉంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే మన లక్ష్యం. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా అందరి లక్ష్యం ఒక్కటే కావాలి.. అది స్టేట్ ఫస్ట్. అన్ని రంగాల్లో ఏపీ నెం.1 కావాలి.
స్వాతంత్ర్యం పెద్దలు సాధించారు…స్వర్ణాంధ్ర మనందరం కలిసి సాధిద్దాం. ఈ జాతీయ జెండా సాక్షిగా మనం ఒక ప్రమాణం చేద్దాం. నేను కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను, నా రాష్ట్రాన్ని నెం.1గా నిలబెట్టడానికి బాధ్యతగా ఉంటాను అని ప్రమాణం చేద్దాం. స్వర్ణాంధ్ర విజన్ కి తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లా అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. అనంతరం వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను మంత్రి చూశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి రాజశేఖర బాబు పాల్గొన్నారు.





