ఉత్తమ ఉపాధ్యాయులకు 17నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ

Must read

రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యారంగంలో గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ లో 37మందిని సింగపూర్ పంపించిన రాష్ట్రప్రభుత్వం. తాజాగా మరో 29మందిని ఫిన్లాండ్ పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు 8రోజులపాటు ఉత్తమ ఉపాధ్యాయులు ఫిన్లాండ్ లో పర్యటించనున్నారు.

ఫిన్లాండ్ విద్యారంగంలోని ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసి, రాష్ట్రంలో సహ ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం (International Proffessional Development Programme) పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మార్గదర్శక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 2026 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29 మంది టీచర్లను ఫిన్లాండ్‌లోని టుర్కు విశ్వవిద్యాలయంలో నిర్వహించే ప్రొఫెషనల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా వారికి అంతర్జాతీయ అనుభవాన్ని అందించాలని నిర్ణయించారు.

మొదటి దశ – ఓరియంటేషన్ విజయవాడలో 4 రోజుల ప్రత్యక్ష శిక్షణా కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. ముగ్గురు ఫిన్నిష్ నిపుణులు ఈ శిక్షణ నిర్వహించారు. ఫిన్నిష్ విద్యా వ్యవస్థ, బోధనా పద్ధతులు, డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వర్క్, మెంటరింగ్ కార్యకలాపాలను పరిచయం చేశారు. రెండోదశలో ఫిన్లాండ్‌లో ప్రత్యక్ష కార్యక్రమం (ఆగస్టు 17–26, 2026). ఫిన్లాండ్‌లోని టుర్కు, రౌమాలో 8 రోజుల ప్రత్యక్ష బోధన, అభ్యసన అనుభవాలను అందిస్తారు. తరగతి గదుల పరిశీలన, ప్రదేశ సందర్శనలు, ప్రారంభ బాల్య విద్యా కేంద్రాలు, ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలల్లోని విద్యావేత్తలతో సంభాషణలు ఇందులో ఉంటాయి. మూడోదశలో ఆన్‌లైన్ మెంటరింగ్, ప్రాజెక్ట్ మద్దతు ఉంటాయి. శిక్షణ అనంతరం ఆన్‌లైన్ మెంటరింగ్ సెషన్లు. పాఠశాల ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి, అమలు, బోధన మెరుగుదలపై దృష్టి. విశ్వవిద్యాలయ మెంటర్లు మూడు నిర్మాణాత్మక ఆన్‌లైన్ మెంటరింగ్ సెషన్ల ద్వారా నిరంతర మార్గదర్శనం చేసి, మద్దతు అందిస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఫిన్లాండ్‌లోని ప్రారంభ బాల్య విద్య, ప్రాథమిక విద్య (ఫిన్లాండ్‌లో 1 నుండి 6 తరగతులు) విధానంపై పరిచయం పొందుతారు. పాల్గొనేవారు శిక్షణ పూర్తయి స్వస్థలాలకు చేరుకున్నాక తమ సొంత అభివృద్ధి ప్రాజెక్ట్‌ను రూపొందిస్తారు. ఇందులో వారు ఫిన్నిష్ బోధనా విధానాలు, పద్ధతులను పరిశీలించి, వాటిని తమ పాఠశాలలు, తరగతి గదులు, అభ్యసన వాతావరణంలో అమలు చేస్తారు. కార్యక్రమంలో రూపొందించిన పాఠశాల-ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులను పాల్గొనేవారు తొలుత తమ తమ పాఠశాలల్లో అమలు చేస్తారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు జిల్లా, మండల స్థాయిలలో తోటి ఉపాధ్యాయులకు రీసోర్స్ పర్సన్లుగా, మెంటర్లుగా వ్యవహరిస్తారు. ఫిన్నిష్ విద్యా వ్యవస్థ నుండి నేర్చుకున్న ముఖ్య అంశాలను ఆంధ్రప్రదేశ్ విద్యా వాతావరణానికి అనుగుణంగా మార్చి అమలు చేస్తారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆటపాటలు, ఆనందదాయక అభ్యసనపై ప్రదర్శన తరగతి గదులు, ఆదర్శ పద్ధతులను ఏర్పాటు చేస్తారు.ప్రాజెక్ట్ అమలును పర్యవేక్షించడానికి, ఫలితాలను నమోదు చేయడానికి కాలానుగుణంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. విజయవంతమైన బోధనా పద్ధతులను సంకలనం చేసి వృత్తిపర అభ్యసన సంఘాల ద్వారా పాఠశాలల్లో ప్రచారం చేస్తారు.

ఉపాధ్యాయులు బాల-కేంద్రిత, ఆట-ఆధారిత, కార్యాచరణ-ఆధారిత విధానాలను తరగతి గది బోధనలో అనుసంధానించేందుకు ప్రోత్సహిస్తారు. రాష్ట్రవ్యాప్త ఉపయోగం కోసం వినూత్న బోధనా పద్ధతులు, అభ్యసన వనరుల డిపాజిటరీని అభివృద్ధి చేస్తారు. విద్యార్థుల నిమగ్నత, అభ్యసన ఫలితాలు, శ్రేయస్సులో మెరుగుదలపై ప్రభావవంతమైన అంచనా అధ్యయనాలు చేపడతారు. ఈ కార్యక్రమ ఫలితాలు ఫౌండేషనల్ లెర్నింగ్ ను బలోపేతం చేయడానికి, అందరికీ ప్రపంచ ప్రమాణాలతో కూడిన, ఆనందదాయకమైన, సమగ్ర విద్యను అందించాలనే ఆంధ్రప్రదేశ్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!