ఈ నెల10వ తేదినా మోదీ హైదరాబాద్ పర్యటన సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిచనున్నారు. ప్రధాని పర్యటనతో కమల దళంలో మరింత కొత్త జోష్ నింపేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనిలో జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీకి శంకుస్థాపనతో పాటు వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌పార్క్ పాటు రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. బీజేపీ నిర్వహించే ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక రాష్ట్ర పర్యటనకు రానుండటం మొదటిసారి కావడంతో రాష్ట్రంలో కమలదళం ప్రతిష్ఠాత్మకంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని బెంగళూరు నుంచి స్పెషల్ విమానంలో బయలుదేరి 2.20 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు పలు ప్రాజెక్టులు పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి హైటెక్‌సిటీకి వెళ్లి సింధు ఆసుపత్రిని ప్రారంభించి అక్కడి వైద్యనిపుణులతో మాట్లాడుతారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు 4.40 గంటలకు చేరుకుంటారు.
సాయంత్రం 5.25 గంటలకు బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 5.30 నుంచి 6.30 వరకు బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత బేగంపేటకు చేరుకుని సాయంత్రం 6.45 గంటలకు ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరుతారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అధిక జనసమీకరణ చేస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో వస్తారని మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదారు 2 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్, ఖమ్మం, పెద్దపల్లి, కాగజ్‌నగర్ నుంచి పార్టీ శ్రేణులు, అభిమానుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేశారు. వీటితో పాటుగా సభ కోసం 3000 ఆర్టీసీ బస్సులనూ, అలాగే కళాశాలలు, పాఠశాలల బస్సులనూ కూడా బీజేపీ బుక్ చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మోదీ సభ ఏర్పాట్లు, జనసమీకరణపై పార్టీ నాయకులతో బుధవారం సమావేశమై చర్చించారు.





