తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. భానుడి భగభగలకు రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం బయటకు రావడానికి ప్రజలు సతమతమవుతున్నారు.
తెలంగాణ రాష్ర్టంలోబ మంచిర్యాల పట్టణం ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలవడం గమనార్హం. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో మంచిర్యాల 14వ స్థానంలో నిలిచింది. ఇది రాష్ట్రంలో ఎండల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
సోమవారం (ఏప్రిల్ 20) మంచిర్యాలలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతతో దేశవ్యాప్తంగా కూడా ఇది అత్యధిక ఉష్ణోగ్రతలలో ఒకటిగా నిలిచింది. ఇక
మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
కొత్తగూడెం, గద్వాలలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా, నిర్మల్, నిజామాబాద్‌లలో 43.0 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వేడి గాలులు (హీట్‌వేవ్) ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, తప్పని పరిస్థితుల్లో వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు వేడి ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వైద్యులు చెబుతున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, సూర్యరశ్మి నుంచి రక్షణ పొందడం వంటి సూచనలు ఇస్తున్నారు.





