ఆదిలాబాద్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్మల్‌లో నిరసనలు, ఇంద్రవెల్లిలో దండోరాలు, అలాగే భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇవన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికే చేశామని గుర్తు చేశారు. “జల్-జంగల్” నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇది అని అన్నారు.గతంలో ఆదిలాబాద్ అభివృద్ధి చెందలేదని, పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయాలని తమ సంకల్పమని పేర్కొన్నారు. ఎన్నో కేసులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, కానీ అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం” అని సీఎం అన్నారు. గత పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం చూడలేదని విమర్శిస్తూ, ఈ కొత్త విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల గురించి వివరించిన సీఎం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఇందుకోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అలాగే పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు రూ.5400 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. అదేవిధంగా 3 కోట్ల 17 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు హైటెక్ సిటీలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌కు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అదే విధంగా ఆదిలాబాద్ అభివృద్ధికి కీలకంగా ఎయిర్‌పోర్ట్, యూనివర్సిటీ, పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనకు కృషి చేస్తామని అన్నారు.
బాసరలోని జ్ఞాన సరస్వతీ ఆలయం అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు.
చివరిగా, “మేం పాలకులు కాదు, ప్రజల సేవకులం” అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.





