2027 జనాభా లెక్కలకు సంబంధించి తెలంగాణలో 2026 ఏప్రిల్ 26న స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి.. నిర్ణీత ఆన్లైన్ జనగణన పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేశారు.
తెలంగాణ జనగణన కార్యాలయం ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ప్రయాణంలో జనాభా లెక్కలు ఒక పునాది రాయి వంటివని అన్నారు. ప్రణాళికా రచన, సుపరిపాలన, సమానాభివృద్ధికి ఇవి కీలక సాధనాలుగా ఆయన అభివర్ణించారు. సమర్థవంతమైన విధాన రూపకల్పన, సమ్మిళిత వృద్ధికి ఖచ్చితత్వంతో కూడిన సమగ్రమైన గణాంకాలు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.
2027 జనాభా లెక్కల ప్రాముఖ్యతను వివరించిన జీ. కిషన్ రెడ్డి… ఆధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించటం ద్వారా ఇదొక పరివర్తనాత్మక దశగా నిలుస్తుందని పేర్కొన్నారు. తద్వారా పారదర్శకత, సామర్థ్యం, సమ్మిళితత్వం మరింత పెరుగుతాయన్నారు.
2026 ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన సౌకర్యం అందుబాటులో ఉంటుందని.. ఆ తర్వాత 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది సమగ్ర సమాచార సేకరణకు బలమైన పునాది వేస్తుందని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక-ఆర్థిక పరిస్థితులపై 2027 జనాభా లెక్కలు స్పష్టమైన అవగాహనను కల్పిస్తాయని.. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడటంలో ఇవి సహాయపడతాయని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఇందులో ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. సేకరించే ప్రతి సమాచారం దేశ భవిష్యత్తుతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ జనాభా లెక్కల డైరెక్టరేట్ సంచాలకులు భారతి హోళికేరి మాట్లాడుతూ.. అధికారిక వెబ్సైట్ అయిన https://se.census.gov.in లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని, తద్వారా జనాభా లెక్కల్లో నేరుగా పాల్గొనవచ్చని తెలిపారు. సమర్పించిన సమాచారం పూర్తి గోప్యంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. సమాచారాన్ని సమర్పించిన వెంటనే ఒక ‘స్వీయ గణన ఐడీ’ వస్తుందని.. ఆ తర్వాత జనగణన అధికారి (ఎన్యూమరేటర్) దానిని పరిశీలించి ఖరారు చేస్తారని ఆమె వివరించారు.





