మ్యారీగోల్డ్ హోటల్, అమీర్‌పేట్‌లో తెలంగాణలో మానవ అక్రమ రవాణా, బాండెడ్ లేబర్ నిరోధంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కన్వర్జెన్స్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “30–40 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోనే బాండెడ్ లేబర్ కేసులు నేను స్వయంగా చూశాను. బాండెడ్ లేబర్ నిర్మూలనకు మీరు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి బాండెడ్ లేబర్ చేయకూడదనే స్పృహ రావాలి” అన్నారు.
అదనపు పని చేయిస్తే చట్టప్రకారం అదనపు వేతనం ఇవ్వాల్సిందేనని, చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే బాండెడ్ లేబర్ పూర్తిగా అరికట్టగలమని మంత్రి స్పష్టం చేశారు. లేబర్ మంత్రి అయిన తర్వాత గిగ్ వర్కర్స్‌కు భద్రత కల్పించే చట్టాన్ని తీసుకువచ్చామని, దీంతో వారికి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
2021 నుంచి 2025 మధ్య రాష్ట్రవ్యాప్తంగా కనీసం 673 మంది బాండెడ్ కార్మికులను రక్షించామని మంత్రి తెలిపారు. వీరిలో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉండగా వ్యవసాయం, ఇటుక భట్టీలు, సాగునీటి పనులు, మత్స్యకార రంగం, గృహ సేవలు, సిమెంట్ పనులు, గొర్రెల కాపరి వంటి రంగాల్లో వారు చిక్కుకున్నారని చెప్పారు. “ఇవి కేవలం గణాంకాలు కాదు—మన సమాజంలో కనిపించని దోపిడీ ముఖచిత్రం” అన్నారు.
మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 24×7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ (8069434343) ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. బాండెడ్ లేబర్ బాధితులకు అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లు ప్రాధాన్యంగా ఇవ్వడానికి ప్రత్యేక జీఓ కూడా జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
“ఎవరైనా అర్హులు ఇల్లు పొందకపోతే నా దృష్టికి తీసుకురండి సంబంధిత ఎమ్మెల్యేతో మాట్లాడి ప్రాధాన్య కింద ఇల్లు ఇస్తాం” అని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం దృఢమైన రాజకీయ సంకల్పంతో పనిచేస్తోందని, లేబర్ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు.





