రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటూ అండగా నిలుస్తున్నదని రాష్ట్ర మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.
శనివారం విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి మొదటి దశలో 156 మంది యాత్రికులు హజ్ యాత్రకు బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గన్నవరం వద్ద ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో హజ్ యాత్రికులకు విడిది సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మైనారిటీ సంక్షేమ శాఖ నేతృత్వంలో రాష్ట్ర హజ్ కమిటీ పర్యవేక్షణలో విడిది కేంద్రం నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు యాత్రికులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్గో వ్యాన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
మొదటి దశలో హజ్ యాత్రకు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎంఏ షరీఫ్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహమ్మద్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, హజ్ కమిటీ సీఈవో గౌస్ పీర్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.
హజ్ యాత్రికులను ఉద్దేశించి మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6090 కోట్ల భారీ బడ్జెట్ మైనార్టీల సంక్షేమానికి కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ జీవితంలో ఒక్కసారి అయినా మక్కా వెళ్లాలని కోరుకుంటారని అలాంటి హజ్ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.





