రాష్ట్రంలో బీసీ సంక్షేమ విద్యాసంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు బీసీ వర్గాలకు మాత్రమే కాకుండా సమాజానికే ఆదర్శం నిలిచారని కొనియాడారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులు, సిబ్బంది, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. బీసీ సంక్షేమ శాఖను రాష్ట్రంలో ఆదర్శ శాఖగా తీర్చిదిద్దడంలో శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున్, ఎంజేపీ సొసైటీ కార్యదర్శి మాధవీలతతో పాటు అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నానని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన ఉపాధ్యాయులు, ఆహారం, వసతులు అందుబాటులో ఉండటంతో బీసీ వెల్ఫేర్ విద్యాసంస్థలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీసీ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసిందన్నారు.
విద్యార్థులతో సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, మస్కిటో మెష్‌లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్, ప్రభుత్వ నిధులతో హాస్టళ్లలో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. కొత్తగా 1500 మరుగుదొడ్ల నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం కోసం కుక్ లు, కాపీలు నియమించామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్యం మెరుగు కోసం త్వరలో 1291 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నామని తెలిపారు.
తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు మంత్రి సవిత స్కూల్ బ్యాగ్ లు ఉచితంగా అందజేశారు. 400 మంది విద్యార్థులకు ఈ బ్యాగ్ లను పంిపణీ చేశారు. గతేడాది కూడా టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి సవిత స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి సవిత అభిలషించారు.
ఫలితాల రావడంలో విశేష కృషి జరిపిన డీబీసీడబ్ల్యూవోలను కూడా మంత్రి సవిత సత్కరించారు. అనంతరం విద్యార్థులతో మంత్రి సవిత సహఫంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, మల్లె ఈశ్వరరరావు, ఎంజేపీ కార్యదర్శి మాధవీలత, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, ఇతర అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.





