రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21 వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా మంగళవారం నాడు హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో మంత్రిగారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ జి.ప్రసాద్ కుమార్ రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి డి.శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీ మహ్మద్ అజారుద్దీన్, శాసన మండలిలో చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించడం వల్ల జరిగిన నష్టం కళ్లముందే కనిపిస్తున్నదని అటువంటి తప్పు పునరావృత్తం కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిథిలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించే విధంగా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆనాటి ప్రభుత్వం నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో 2బిహెచ్ కె ఇండ్లను నిర్మించి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వారికి కేటాయించడం వల్ల తమ జీవనోపాథికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇండ్లు తీసుకున్న లబ్ధిదారులు అక్కడ నివసించడానికి సంసిద్ధతం వ్యక్తం చేయడం లేదని క్షేత్ర స్థాయి పరిశీలనల్లో స్పష్టమైందన్నారు.
ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలోనే ప్రభుత్వ స్థలాలు, మురికివాడలు, భూదాన్, గతంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లు శిధిలావస్థలో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ విషయంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని అధికారులను ఆదేశించారు.
బిహెచ్ కె ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి శ్రీ పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి అయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలని, అది కూడా ఆ కాలనీలకు అయిదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తైన ఇండ్లలో లబ్ధిదారులు ఉండేలా చూసేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్లు ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. శాసనసభ స్పీకర్ శ్రీ జి. ప్రసాద కుమార్ మాట్లాడుతూ శాసనసభలో తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశాలు నిర్వహించడం పట్ల మంత్రిగారికి అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతున్నదని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు.





