అగ్నిప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి :హోంమంత్రి వంగలపూడి అనిత

Must read

రాష్ట్ర అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించిన మంత్రి, కొత్తగా ప్రతిపాదించిన 5 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

అగ్నిమాపక శాఖలో ఉన్న సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన 1,275 పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని, ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌లో ఉన్న 305 పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అగ్నిమాపక సిబ్బంది స్పందన సమయాన్ని ప్రస్తుతం ఉన్న 25–30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు.

పరిశ్రమల సహకారంతో ఫైర్ అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయడం, ఫైర్ టెండర్ల వినియోగంపై ఆడిట్ నిర్వహించడం, SEZ ప్రాంతాల్లో సమిష్టి ఫైర్ స్టేషన్ల ఏర్పాటు అంశాలను పరిశీలించాలని సూచించారు. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకం తప్పనిసరి చేయడంతో పాటు, వారి పనితీరుపై ర్యాండమ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

లైసెన్స్ పొడిగింపులకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు తప్పనిసరి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అడవి అగ్నిప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రోన్ల వినియోగం, హాజర్డ్ సైన్ బోర్డుల ఏర్పాటు, వ్యర్థాల సరైన వర్గీకరణ లేకపోవడం వల్ల సంభవించే అగ్నిప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

పాఠశాలలు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్లలో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, “ఆపద మిత్ర” తరహాలో యువత, విద్యార్థులకు స్వచ్ఛంద సేవా శిక్షణ విస్తరించాలని తెలిపారు. అలాగే సింగపూర్, స్విట్జర్లాండ్తో పాటు ఛత్తీస్‌గఢ్, చండీగఢ్ రాష్ట్రాల విపత్తు నిర్వహణ విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో అమలు చేయగల అంశాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక అత్యవసర సేవలను 112 సేవలతో సమన్వయం చేసి, ఆధునిక సాంకేతికతతో సేవలను మరింత బలోపేతం చేయాలని మంత్రి అనిత స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!