కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మహిళా సాధికారతపై మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలున్ని పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. మహిళలకు న్యాయం చేయాలనే నిజమైన సంకల్పం ఉన్నట్లయితే, ఈ చారిత్రాత్మక బిల్లును వ్యతిరేకించడానికి ఎటువంటి కారణమూ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు దేశ మహిళలే తగిన సమాధానం చెబుతారని బండి సంజయ్ హెచ్చరించారు.మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం దశాబ్దాల నాటి ఆకాంక్షగా కొనసాగుతుందని పేర్కొన్న బండి సంజయ్, ఈ బిల్లుతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు.
మహిళల సామాజిక, రాజకీయ ఎదుగుదలకు ఇది కీలక అడుగుగా నిలుస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థించాలని, మహిళల అభ్యున్నతిని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా కార్యరూపం దాల్చాలని ఆయన సూచించారు.
‘‘మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ అనంతరం పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాని ఫలితంగా తెలంగాణ అసెంబ్లీలో సుమారు 60 మంది మహిళలకు అవకాశాలు లభించే అవకాశం ఉంది’’ అని ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు, ఇతర రాజకీయ పార్టీల స్పందనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు అమలులోకి వస్తుందో, పార్లమెంట్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో అన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.





