ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులను వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఒక్కరోజే రూ.2,950 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేయడం విశేషంగా మారింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు ప్రధానంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం వినియోగించబడుతున్నాయి. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ చెల్లింపుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ వేగంగా చర్యలు చేపట్టింది. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వం తెలుపుతోంది.
ఆర్థిక శాఖ ఈ చెల్లింపులను మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో కొనసాగుతుంది. నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.
రూ.7,059 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, ఇందులో భాగంగా మొదటి విడతగా భారీ మొత్తాన్ని విడుదల చేయడం ద్వారా ఉద్యోగుల్లో నమ్మకం పెంచింది.
కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే కాకుండా, ప్రభుత్వానికి మెటీరియల్ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రూ.614 కోట్ల బిల్లులను క్లియర్ చేయడం ద్వారా చిన్న వ్యాపారులకు మంచి ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం సర్వీసులో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ కూడా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం వరుస బకాయిలు విడుదల చేస్తుండటంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దీర్ఘకాల నిరీక్షణకు తెరపడిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.





