ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శాఖ ఆధునికీకరణ లక్ష్యంగా భారీ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం, తొలి విడతగా నూతన వాహనాలు, అత్యాధునిక పరికరాలను ప్రారంభించింది. దీని కోసం మొత్తం రూ.252.93 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రణాళికలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రజా సేవకు ప్రభుత్వంఅంకితం చేసింది.
అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు జెండా ఊపి కొత్త వాహనాలను అధికారికంగా ప్రారంభించారు.
రూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి అగ్నిప్రమాదాల సమయంలో వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను కొనుగోలు చేశారు. ఈ వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించేందుకు రూపొందించబడ్డాయి. ఈ పరికరాల పనితీరును, వాటి ప్రత్యేకతలను కూడా ముఖ్యమంత్రికి వివరించారు.
రూ.2.49 కోట్ల వ్యయంతో 50 అత్యవసర రబ్బర్ బోట్లు ఏర్పాటు చేశారు. వరదలు, విపత్తుల సమయంలో ఈ బోట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎంతో ఉపయోగపడతాయని. అదేవిధంగా రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు తీసుకున్న చర్యలను అభినందించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి ఈ పరికరాలను సమకూర్చినందుకు ప్రశంసలు తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అగ్నిమాపక సేవలను మరింత మెరుగుపరచాలని ఆయన అధికారులకు సూచించారు.
అగ్నిమాపక శాఖను బలోపేతం చేయడం ద్వారా ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక పరికరాలను సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.





