ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ర్టం అభివృద్దిలో మునుముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభావార్త అందించింది. ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపింది. దీంతో రాష్ర్ట ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ప్రాజెక్టు కింద నిడదవోలు నుంచి దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్లను నిర్మించనున్నారు. ఈ లైన్లు ఏర్పాటవడంతో తూర్పు గోదావరి, విశాఖపట్నం ప్రాంతాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.
ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై సుమారు 4.3 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే వంతెనను నిర్మించనున్నారు. ఇది దేశంలోనే ప్రముఖమైన రైల్వే వంతెనల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ కొత్త లైన్ల నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గంలో ఉన్న ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లకు వేగం పెరగడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశముందని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సరుకు రవాణా రంగానికి కూడా పెద్ద ఊతం లభించనుందన్నారు. తీర ప్రాంత పోర్టులు, పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరేలా మార్గం సుగమం అవుతుందని,దీంతో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు తన ప్రకటనలో ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. రైల్వే మౌలిక వసతులు మెరుగుపడటం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆనందాన్ని వ్యక్త పరిచారు.





