తెలంగాణ రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ ఒక్క పేదవాడికి, నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రజల భూహక్కులను కాపాడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. 22ఏ భూములకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని చెప్పారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందంటూ సోషల్ మీడియాలో, బయటా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు.
బుధవారం రోజున డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములపై వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ సమావేశం క్యూర్ పరిధిలోని జిల్లాలకు సంబంధించి నిర్వహించినప్పటికీ, ఇందులో జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రైవేట్ భూయజమానులకు న్యాయం చేస్తూనే, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన గురుతర బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు.
22ఏ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలలో ఎక్కడ వచ్చినా పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి రికార్డులు, వాస్తవాలు పరిశీలించి బాధితులకు ఊరట కలిగించాలని చెప్పారు. వీటికి తోడు, ప్రజావాణి కార్యక్రమంలో 22ఏ భూములకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.22ఏ భూముల వివాదాల పరిష్కారానికి సంబంధించి మాన్యువల్ మరియు కోర్టు నిబంధనల ప్రకారం హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల సమయ పరిమితిలోనే విచారణ పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించి, చట్టబద్ధంగా తుది నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కాలయాపన చేసి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమణల బారి నుంచి కాపాడటం యంత్రాంగం యొక్క ప్రథమ కర్తవ్యమని మంత్రి పునరుద్ఘాటించారు. నిషేధిత భూముల్లో అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను హెచ్చరించారు. 22ఏ జాబితాలో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్లకే ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రజా ప్రయోజనాలు మరియు ప్రభుత్వ ఆస్తుల రక్షణను సమతుల్యం చేస్తూ కలెక్టర్లు నిర్భయంగా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. చట్టపరిధిలో ఉన్న ప్రతి పేదవాడికీ, భూమి యజమానికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెచ్చి ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.





