హనుమాన్ జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు హనుమాన్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా భక్తి భావంతో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.పూజల అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, శ్రీ హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి పర్వదినం ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిబద్ధతను పెంపొందించే ప్రత్యేక సందర్భమని అన్నారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా వినయంగా ఉండాలనే గుణాన్ని హనుమంతుడు మనకు నేర్పిస్తాడని ఎమ్మెల్యే అన్నారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. హనుమాన్ జయంతిని అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసే కార్యసాధకుడిగా హనుమంతుడు నిలిచాడని, భయాలను తొలగించి ధైర్యాన్ని నింపే అభయాంజనేయుడిగా ఆయనను భావిస్తామని తెలిపారు. వాయుపుత్రుడి ఆశీస్సులతో ప్రజలందరికీ విజయాలు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.





