తెలంగాణలో ఖరీఫ్-2026 సీజన్లో సరిపడా ఎరువుల సరఫరాకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్–జూన్ నెలల్లో రాష్ట్రానికి జరిగిన ఎరువుల సరఫరా లోటును ఈ నెల అదనపు కేటాయింపుల ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 55.52 లక్షల ఎకరాల్లో విత్తనాలు విత్తడం పూర్తయ్యాయని, గత ఏడాది ఇదే సమయానికి 52.04 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరగగా.. విస్తీర్ణం ఇప్పటికే పెరగడంతో ఎరువుల అవసరం కూడా పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఖరీఫ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అన్ని జిల్లాల్లో ఎరువుల నిల్వలను ఏర్పాటు చేసినప్పటికీ, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేంద్రం ఆమోదించిన ప్రణాళిక మేరకు సరఫరాలు జరగలేదని తెలిపారు. ముఖ్యంగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సరఫరాలో భారీ లోటు ఏర్పడటంతో బఫర్ స్టాక్‌లు తగ్గిపోయి, రైతులకు సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందన్నారు.
ఏప్రిల్–జూన్ కాలంలో యూరియా 0.45 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 1.04 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2.53 లక్షల మెట్రిక్ టన్నుల మేర లోటు ఏర్పడిందని మంత్రి వివరించారు. ప్రారంభ దశ పంటలకు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అత్యంత కీలకమైనందున, ఈ లోటు రైతులకు ఇబ్బందులు కలిగించే అవకాశముందని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) నుంచి ఉత్పత్తి అయ్యే యూరియాలో 90 శాతానికి పైగా తెలంగాణకే కేటాయించాలని మరోసారి కేంద్రాన్ని మంత్రి కోరారు. రాష్ట్రంలో డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్ర అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగు ముఖ్యమైన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్–జూన్ నెలల సరఫరా లోటును అదనపు కేటాయింపులతో భర్తీ చేయడం, ఆమోదించిన నెలవారీ ప్రణాళిక ప్రకారం ఎరువుల కంపెనీలు సరఫరాలు నిరంతరాయంగా కొనసాగించేలా ఆదేశించడం, రామగుండం ఆర్ఎఫ్సీఎల్ యూరియాలో 90 శాతానికి పైగా తెలంగాణకు కేటాయించడం, అలాగే రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువుల రవాణా, నిల్వలు జరిగేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలను సానుకూలంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాను కోరారు.





