వై. శ్రీలక్క్ష్మికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Must read

ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీలో వివాదాస్పద అధికారిణిగా గుర్తింపు పొందిన 1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ వై. శ్రీలక్క్ష్మికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి బాధ్యతలు లేకుండా వెయిటింగ్ లో ఉన్న ఆమెను.. హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవని, కేవలం మానవతా దృక్పథంతో ఆమెకు గౌరవప్రదమైన వీడ్కోలు పలికేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే పచ్చి నిజం బ్యూరోక్రాటిక్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

వై. శ్రీలక్క్ష్మి ఈ జూన్ 30వ తేదీతో తన సుదీర్ఘ ఐఏఎస్ సర్వీసు నుంచి రిటైర్ కానున్నారు. అంటే ఆమె పదవీ కాలం ముగియడానికి కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ ఎలాంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లోనో లేదా లూప్ లైన్ పరిధిలోనే రిటైర్ అయితే, ఆ ప్రభావం ఆమె రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై, పెన్షన్ నిబంధనలపై పడే అవకాశం ఉంది. ఒక సీనియర్ మహిళా అధికారిణిగా ఆమె సుదీర్ఘ కెరీర్ ముగింపు దశలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, సర్వీసులో ఉంటూ గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కెరీర్ ప్రారంభించిన వై. శ్రీలక్క్ష్మి.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్‌కు కేటాయించారు.

అయితే, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక.. ఏపీకి వచ్చేందుకు సెంట్రల్ అడ్మినిస్టేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల ద్వారా తెలంగాణ నుండి ఏపీ కేడర్‌లోకి బదిలీ చేయించుకున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆమెకు విపరీతమైన ప్రాధాన్యత దక్కింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమె సచివాలయంలో చక్రం తిప్పారు. జగన్ హయాంలోనే ఆమెకు వరుస ప్రమోషన్లు లభించి బ్యూరోక్రసీలో టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు.

ఐఏఎస్ వై. శ్రీలక్క్ష్మి సుదీర్ఘ కెరీర్ ఎంత వైభవంగా సాగిందో.. దానికి రెట్టింపు స్థాయిలో పెను వివాదాలు, లీగల్ ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో ఆమె తీవ్ర చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నాటి మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్క్ష్మి నిబంధనలకు విరుద్ధంగా గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా జీవోలు ఇచ్చారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను అరెస్ట్ చేసింది.

ఈ కేసుల వల్ల ఆమె ఐఏఎస్ సర్వీసు నుంచి సస్పెండ్ అవ్వడమే కాకుండా, చంచల్‌గూడ జైల్లో సుదీర్ఘ కాలం రిమాండ్ ఖైదీగా జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సైతం ఆమె పేరు ప్రముఖంగా వినపడింది.ఆమెపై ఇప్పటికీ పలు కోర్టు కేసులు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు నడుస్తున్నప్పటికీ.. వాటన్నింటినీ పక్కనబెట్టి, రిటైర్మెంట్‌కు కేవలం నాలుగు రోజుల ముందు ప్రభుత్వం ఆమె సీనియారిటీని గౌరవించింది. సచివాలయంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అధికారుల బదిలీలను చూసే జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించడం ద్వారా ఆమె ఐఏఎస్ కెరీర్‌కు ఒక సాఫీ ముగింపును ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు సర్కార్ చేసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!