ఆటోనగర్‌లో కంపాక్టర్ ని ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్

Must read

విజయవాడ నగరంతోపాటు ఆటోనగర్ లో రోజూ వచ్చే చెత్తని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌కు తరలించే ఏర్పాటు చేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు. ఆటోనగర్ లో నూతన కంపాక్టర్‌ని గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, మెరుగైన చెత్త సేకరణ, సమర్థవంతంగా వ్యర్థ నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు ఈ కంపాక్టర్‌ ఉపయోగపడుతుందన్నారు. 42 క్యూబిక్ మీటర్ల ఈ కంపాక్టర్ కు 50 శాతం నిధులను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ అందించినట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు గద్దె రామమోహన్ రావు, తమ పార్టీ యువనేత గద్దె క్రాంతి కుమార్, ఆటోనగర్ అసోసియేషన్, ఐలా పెద్దలు ఇక్కడి చెత్త సమస్యను తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు.

ఈ సమస్య పరిష్కారం విషయమై వారు తనతో చర్చించినట్లు తెలిపారు. ఆటోనగర్‌ ప్రాంతంలోని చెత్తని జిందాల్ ప్లాంట్‌కు తరలించే విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. సమస్య తనకు తెలిసిన వెంటనే జిందాల్ ప్లాంట్ వారితో, మున్సిపల్ శాఖా మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ప్రతిరోజూ 10 నుంచి 12 టన్నుల చెత్త వస్తుందని, ఆ మొత్తాన్ని జిందాల్ ప్లాంట్ కు తరలించడానికి వారితో మాట్లాడి ఒప్పించినట్లు చెప్పారు. త్వరలో ఆటోనగర్ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, వారి సలహాలు కూడా తీసుకుని, ఇక్కడ చెత్త పేరుకుపోకుండా, ఏరోజు చెత్త ఆ రోజు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎండీ ఏఎస్ దినేష్ కుమార్, జోనల్ మేనేజర్ కుంచె బాబ్జీ తదితరులను తాను ఇక్కడకు తీసుకువచ్చి, చెత్త ట్రాన్స్ పోర్ట్ సమస్యను వారికి వివరించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇక్కడ ఉన్న ట్రాక్టర్ స్టేషన్ ని కూడా త్వరలోనే మరో ప్రదేశానికి తరలించే ఏర్పాటు చేస్తానన్నారు. ఈ విషయమై ఏపీఐఐసీ వారితో కూడా మాట్లాడినట్లు చెప్పారు. ఆటోనగర్ లో చెత్త సమస్యపై ప్రత్యేక దృష్టిపెట్టి, ఈ సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రాంతాలలో చెత్త సమస్యలపై వార్తలు రాసి, తమ దృష్టికి తీసుకువచ్చి, ఆ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్న మీడియా వారిని చైర్మన్ పట్టాభిరామ్ ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ మేనేజర్ కుంచె బాబ్జీ, గద్దె క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!