సాయికృష్ణ కేసు.. మార్కాపురం టు విజయవాడ మధ్యలో ఏం జరిగింది?

Must read

విజయవాడ నగరంలో సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ ఏమయ్యాడు, పోలీసులు కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయడా? లేదా ఎవరైనా మాయం చేశారా? ఈ ప్రశ్నల చుట్టూ తిరుగుతున్న మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయమే కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి చేరుకున్న అధికారులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఒకవైపు కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ మధ్య ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి స్టేషన్‌లో జరిగిన పరిణామాల వరకు ప్రతి అంశాన్ని దర్యాప్తు బృందం భూతద్దంతో వెతుకుతోంది. ముఖ్యంగా పోలీసులపైనే ఆరోపణలు వస్తుండటంతో సాక్ష్యాల సేకరణలో అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏసీబీ దైవప్రసాద్ బృందం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లింది. అక్కడ సాయికృష్ణ తల్లి విజయలక్క్ష్మి మేనమామ నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గలను సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్‌లు రికార్డ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు విచరణాధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్ లాకప్‌లో ఉంచారని, అక్కడ సీఐ నాగరాజు అతడిని అమానుషంగా చిత్ర వధ చేసి చంపేశారని వారు ఆరోపించారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్‌ల అనంతరం దర్యాప్తు టీం కృష్ణ లంక స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ కేవలం మాటలతో కాకుండా డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా నిజానిజాలు తేల్చాలని నిర్ణయించింది. స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలు అత్యంత కీలకం కావడంతో అప్పటికప్పుడు ఫోరెన్సిక్ అండ్ సైబర్ అనాలసిస్ టీమ్ పిలపించారు. వీటిన్నింటినీ అధికారులు సీజ్ చేసి, విశ్లేషణ కోసం నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ రాత్రి స్టేషన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ డిజిటల్ ఆధారాలే ఇప్పుడు కీలకంకానున్నాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ ఆపరేషన్‌లో ఎవరెవరు పాల్గొన్నవారు? అనే కోణంలో విచారణ సాగుతోంది. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారితోపాటు మరో ఎనిమిది మంది సిబ్బందిని శుక్రవారం దర్యాప్తు టీం విచారించింది. పెండింగ్‌లో ఉన్న ఔఃచి అమలు చేసేందుకే సాయికృష్ణ కోసం నలుగురు సిబ్బందిని మార్కాపురం పంపినట్టు ఏడీసీపీ వివరించినట్టు సమాచారం. అయితే అతడి తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్పగించారు.?లాకప్‌లో ఉంచిన సమయం ఎంత? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు వారి స్టేట్మెంట్‌లు రికార్డు చేశారు. కేసు తీవ్రతను దృష్ట్యా, ఈ అదృశ్యం వ్యవహారంపై విచారణాధికారిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ను నియమించారు. ఆయన శుక్రవారం విజయవాడకు చేరుకుని, తొలుత డీజీపీని కలిసి కేసు పురోగతిని వివరించారు. అనంతరం విజయవాడ సీపీ రాజశేఖరబాబును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరుగా కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లిన ఎస్పీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతానికి దర్యాప్తు బృందం ఎనిమిది మంది కీలక సిబ్బందిని విచారిస్తోంది. ఇందులో టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక స్థానిక పోలీసు సిబ్బంది ఉన్నారు.
చట్టం ఏం చెప్తోంది? శవం లేకపోతే కేసు నిలవదా?
సినీ ఇండ స్టీలో సంచలనం సృష్టించిన దృశ్యం’ సినిమా కథ అందరికీ గుర్తే. అక్కడ ఒక హత్య జరుగుతుంది, నిందితులు ఎవరో పోలీసులకు స్పష్టంగా తెలుసు. కానీ, బాడీ దొరక్కపోవడంతో హీరో చాకచక్యంగా చట్టం పరిధి నుంచి తప్పించుకుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కూడా శవం దొరకకూడదని, హీరో సేఫ్ కావాలని టెన్షన్‌తో కోరుకుంటారు. సరిగ్గా ఇదే తరహా సస్పెన్స్, ఉత్కంఠ ఇప్పుడు విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులోనూ కనిపిస్తోంది. సాయికృష్ణ కనిపించకుండా పోయి నెల రోజులు దాటుతున్నా, అతని ఆచూకీ ఏమైందనే దానిపై అటు పోలీసుల దగ్గర, ఇటు కోర్టుల దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. చట్టం ముందు ప్రస్తుతం అతను ‘మిస్సింగ’ మాత్రమే.“పోలీసులు అతడిని కస్టడీలోనే చంపేశారు.. బూడిద కూడా లేకుండా కాల్పించేశారు” అంటూ వస్తున్న వార్తలన్నీ ప్రస్తుతం కేవలం రాజకీయ ఆరోపణలు, గాసిప్స్‌గానే ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ లాకప్‌లో ఏదైనా అనూహ్య సంఘటన జరిగి ప్రాణాలు పోయి ఉంటే.. సాధారణంగా పోలీసులు ఆసుపత్రికి తరలించడమో, గుండెపోటు అని కవర్ చేయడమో చేస్తుంటారు. కానీ, ఇక్కడ అసలు ఆనవాళ్లే లేకుండా మాయం చేశారనే ప్రచారం దృశ్యం సినిమాలోని పోలీస్ స్టేషన్ కింద శవాన్ని దాచిపెట్టిన ట్విస్ట్‌ను గుర్తుకు తెస్తోంది. ఈ వ్యవహారంలో పటమట, కృష్ణలంక పోలీస్ సర్కిళ్లలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, పోలీసులు నోరు విప్పడం లేదు. దీంతో ఈ ఉదంతం ఎప్పటికీ ఛేదించలేని ఒక మిస్టరీగా మిగిలిపోనుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తాము సాయికృష్ణను అసలు అదుపులోకే తీసుకోలేదని పోలీసులు కోర్టుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు. సాయికృష్ణతో పాటు మార్కాపురంలో పట్టుబడిన మిగిలిన వారిని పోలీసులు విచారించి అప్పట్లోనే వదిలేశారు. వారితో పాటే సాయికృష్ణను కూడా మేము వదిలేశాం, ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అని చెప్పుకునే లూప్‌హోల్ పోలీసులకు ఉంది. కానీ, తమకు అసలు సంబంధమే లేదని పూర్తిగా తిరస్కరించకుండా, విచారణకు సమయం కోరడమే ఇక్కడ కథను మలుపు తిప్పుతోంది. సాయికృష్ణ ఆనవాళ్లు దొరక్కపోతే, తాము స్టేషన్ నుంచి పంపించేసిన తర్వాతే అతను అదృశ్యమయ్యాడనే వాదనను పోలీసులు తెరపైకి తెచ్చే అవకాశం లేకపోలేదు.దృశ్యం సినిమాలో లాగా శవం దొరక్కపోతే పోలీసులు చట్టపరంగా సేఫ్ అయినట్లేనా అంటే.. న్యాయశాస్త్రం ప్రకారం అలా అనుకుంటే పొరపాటే. కార్పస్ డెలెక్టి సూత్రం ప్రకారం సాధారణంగా నేరాన్ని నిరూపించడానికి భౌతిక ఆధారాలు అవసరమే అయినప్పటికీ.. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసినట్లు పరిస్థితుల ప్రభావం బలంగా ఉండి, నిందితుడు చివరిసారిగా ఎవరి ఆధీనంలో ఉన్నాడో రుజువైతే శవం లేకపోయినా శిక్ష ఖరారు చేయవచ్చు.” సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లినట్లు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, ఆ తర్వాత అతను ఏమయ్యాడో నిరూపించాల్సిన పూర్తి బాధ్యత సెక్షన్ 106 ప్రకారం పోలీసుల పైనే ఉంటుంది. హైకోర్టు విధించిన గడువు లోగా ఆనవాళ్లు దొరక్కపోతే.. ఈ దృశ్యం’ తరహా కథ క్లైమాక్స్ పోలీసులకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!