అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ యోగా గురువు స్వామి బాబా రాందేవ్ శుక్రవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ జాయింట్ సెక్రటరీ గోపాలకృష్ణ రోణాంకి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర బాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, విమానాశ్రయ డైరెక్టర్ ఎం.ఎల్.కే. రెడ్డి, విమానాశ్రయ సీఎస్‌వో కె. ధర్మేంద్ర, గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, తహసీల్దార్ కేశవయ్య తదితరులు స్వామి బాబా రాందేవ్‌కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద మీడియాతో మాట్లాడిన స్వామి బాబా రాందేవ్, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి రీత్యా, సంస్కృతి పరంగా ఎంతో ఆధ్యాత్మికత కలిగిన రాష్ట్రంగా అభివర్ణించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడని, ఆయన నిజాయితీ, కృషి, దూరదృష్టి దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారతీయ రాజకీయాల్లో ఆయన హిమాలయంలాంటి నాయకుడని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల తనకు ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని తెలిపారు.
యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొంటూ “కరో యోగ్ – రహో నిరోగ్” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన గుంటూరుకు పయనమయ్యారు.





