విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Must read

రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించామని, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీల సంక్షేమం, వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవాల) సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున ‘ముషాయిరా’ (కవి సమ్మేళనాలు) నిర్వహించనున్నట్లు  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వాహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మైనార్టీ యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కొరకు ప్రత్యేకంగా   రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులను క్రిస్టియన్ మైనార్టీ యువత స్వయం ఉపాధి రంగంలో రాణించడానికి తగిన ఆర్థిక ప్రోత్సాహం అందించడానికి కేటాయిస్తామన్నారు.

మైనార్టీ సంస్థలకు సంబంధించిన విలువైన వక్ఫ్, ఇతర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు తగిన చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మైనార్టీల  స్మశాన వాటికల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం తక్షణమే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో స్మశాన వాటికల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరించి కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

హైదరాబాద్ నగరంలో జరగబోయే మొహర్రం వేడుకల సందర్భంగా, 9వ రోజున నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ కోరగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి, తప్పకుండా హాజరవుతానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  ​ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ​మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్,  ​మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ మరియు ప్రెసిడెంట్ ఫహీమ్ ఖురేషీ, ​ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, ​క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాను, ​మైనార్టీ వెల్ఫేర్ సెక్రెటరీ షఫీ ఉల్లా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!