రైతన్న కృషితోనే తెలంగాణ అగ్రస్థానం :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Must read

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు–2026లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని వెల్లడించగా, తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు స్పష్టమైందన్నారు.

NMEO-OP మిషన్ కింద 2021 నుండి 2026 వరకు దేశవ్యాప్తంగా 2,73,084 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, అందులో 98,112 హెక్టార్లతో తెలంగాణ ఒక్కటే 36 శాతం వాటాను కలిగి ఉండటం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుండగా, 79,448 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు.

ఈ విజయం కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను స్వీకరిస్తూ ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు విశేషంగా తోడ్పడుతున్నారని చెప్పారు.

దేశంలో ఎడిబుల్ ఆయిల్స్ అవసరం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుందని మంత్రి తెలిపారు. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాలపాటు దిగుబడి అందే ఈ పంట ద్వారా రైతులు ఎకరాకు సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “తెలంగాణ రైతన్న కృషి, పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి వచ్చిన ఫలితమే ఈ అగ్రస్థానం. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1గా నిలవడం ప్రతి రైతుకు గర్వకారణం. రైతుల సంక్షేమం, ఆదాయ వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది” అని స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!