రాష్ట్రంలోని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్న సీఎం, పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం త్వరలో “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన అర్హులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలుకావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం “అభివృద్ధి-సంక్షేమం” అనే ద్వంద్వ లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతితో పాటు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల వల్ల పేద కుటుంబాలకు నేరుగా ఉపయోగం చేకూరాలని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరే విధంగా డేటా ఆధారిత వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగానే “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” తీసుకొస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ కార్డు ద్వారా ఒక కుటుంబానికి అందుతున్న అన్ని ప్రభుత్వ పథకాల సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయడంతో పాటు, ఇంకా ఏ పథకాలకు అర్హత ఉందో గుర్తించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. దీని వల్ల ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అవుతాయన్నారు.
అన్న క్యాంటీన్ల నిర్వహణపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్యాంటీన్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. “ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు” అని స్పష్టం చేసిన సీఎం, పేద ప్రజలు గౌరవంగా, సంతృప్తిగా భోజనం చేసే వాతావరణం కల్పించాలని సూచించారు. అన్న క్యాంటీన్ల ద్వారా అనేక పేద కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభిస్తోందని, తక్కువ ఖర్చుతో మూడు పూటలా ఆహారం అందుతోందని పేర్కొన్నారు.
మహిళల భద్రత అంశంపై కూడా సీఎం తీవ్రంగా స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష చూపవద్దని పోలీసు శాఖకు ఆదేశించారు. ముఖ్యంగా లైంగిక దాడుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. “తప్పు చేయాలంటే నేరస్తులు భయపడే పరిస్థితి రావాలి” అని వ్యాఖ్యానించిన సీఎం, రాష్ట్రంలో కఠినమైన పోలీసింగ్ అవసరమని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఆదా అంశాలపై కూడా సీఎం కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని వల్ల విద్యుత్ వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం అవుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను సీఎం అప్రమత్తం చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు.
వ్యవసాయ రంగంపై కూడా సీఎం సమగ్ర చర్చ నిర్వహించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ పరిశోధనలపై మరింత దృష్టి పెట్టాలని, కొత్త సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
అలాగే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల ద్వారా అధిక లాభాలు వస్తాయని రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రతి ఇంటికి చేరేలా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.





