వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. పులులు, చిరుతలు, ఆసియా సింహాలు, మంచు చిరుతలు వంటి పెద్ద పులి జాతుల సంరక్షణలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్య పాత్ర పోషిస్తోందని అన్నారు. భవిష్యత్ తరాల భద్రత, అడవుల పరిరక్షణ కోసం వన్యప్రాణుల సంరక్షణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నెహ్రు జువలజీకల్ పార్క్ లో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA) రెండు రోజుల వర్క్ షాప్ “షేర్డ్ స్ట్రైప్స్ – షేర్డ్ ఫ్యూచర్” అనే థీమ్ తో నిర్వహించారు.
గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ జంతు ప్రదర్శనశాల దేశంలోని అతిపెద్ద, అత్యుత్తమ జంతు ప్రదర్శన పార్క్‌లలో ఒకటిగా నిలిచిందన్నారు. వన్యప్రాణుల సంరక్షణ, సంతానోత్పత్తి, ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఈ పార్క్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. “షేర్డ్ స్ట్రైప్స్ – షేర్డ్ ఫ్యూచర్” కార్యక్రమం ప్రకృతి, వన్యప్రాణుల పరిరక్షణ పట్ల దేశ, రాష్ట్ర నిబద్ధతను పునరుద్ఘాటిస్తోందన్నారు.
భారతీయ సంస్కృతి ఎప్పటికప్పుడు ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణుల పట్ల గౌరవం, సమతుల్యత, సహజీవన భావనతో ముందుకు సాగిందని, వన్యప్రాణుల సంరక్షణ కేవలం పర్యావరణ బాధ్యత మాత్రమే కాకుండా నాగరికతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.నెహ్రూ జులాజికల్ పార్క్ లో టైగర్ సఫారీ, అంతరించిపోతున్న జాతుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA) వంటి చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని గవర్నర్ తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రపంచ దేశాలు సంరక్షణ, పరిశోధన, అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం కలుగుతోందన్నారు. భారతదేశ అనుభవం ఆసియా, ఆఫ్రికా దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కూడా గొప్ప జీవవైవిధ్యానికి నిలయమని గవర్నర్ పేర్కొన్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ అభయారణ్యం వంటి పులి సంరక్షణ కేంద్రాలు రాష్ట్ర ప్రత్యేకతను చాటుతున్నాయని అన్నారు. హరితాభివృద్ధి, ప్రజా భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీ శాఖతో పాటు భాగస్వామ్య సంస్థలను గవర్నర్ అభినందించారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అడవులు పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం గవర్నర్ జువాలాజికల్ పార్క్ లో పెద్ద పులులు, ఇతర అటవీ జంతువులను పరిశీలించారు. ఈ సందర్భంగా జూలో ఏర్పాటు చేసిన అటవీ జంతు చిత్రాల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





