తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి ప్రభావం

Must read

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక తెలుగు వ్యక్తి పేరు సంచలనంగా మారింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నూతన ముఖ్యమంత్రి విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా, కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న విష్ణురెడ్డి పేరు ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో విజయ్ గవర్నర్‌ను కలిసిన సమయంలో తీసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై అందరి దృష్టి పడింది.

ఆ ఫొటోలో సీఎం విజయ్‌కు అత్యంత సమీపంలో కనిపించిన విష్ణురెడ్డి ఎవరు? ఆయన పాత్ర ఏమిటి? అనే అంశాలపై రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి పెరిగింది.

విష్ణురెడ్డి పూర్తి పేరు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె గ్రామం. గత పదిహేనేళ్లుగా చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన అక్కడ గ్రానైట్ వ్యాపారంలో స్థిరపడ్డారు. వ్యాపార రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణురెడ్డి, చెన్నైలో రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఆయన పేరు వినిపించడానికి ప్రధాన కారణం విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధమే. టీవీకే పార్టీ ఆవిర్భావం నుంచి విజయ్‌కు వ్యూహాత్మక సలహాలు ఇస్తూ, పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో కూడా పార్టీ కార్యాచరణ, సమన్వయం, కీలక సమావేశాల్లో ఆయన చురుకుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

విష్ణురెడ్డి కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన తండ్రి రామనారాయణరెడ్డి గతంలో కలికిరి మండలంలో సర్పంచ్‌గా, వైస్ ఎంపీపీగా పనిచేశారు. స్థానిక రాజకీయాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాగే విష్ణురెడ్డి తల్లి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అత్యంత సమీప బంధువు కావడం విశేషం.

కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనంద రెడ్డికి విష్ణురెడ్డి తల్లి సోదరి అవుతారు. ఈ బంధుత్వం రీత్యా విష్ణురెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కిశోర్ కుమార్ రెడ్డి కుటుంబాలకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. దీంతో ఆయన పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులో ప్రస్తుతం విజయ్ రాజకీయ ఎదుగుదల దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్, తొలిసారి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీ నాయకుడిగా అవతరించడం విశేషం. ఈ విజయానికి వెనుక పనిచేసిన కీలక వ్యక్తుల్లో విష్ణురెడ్డి ఒకరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు చర్చల సమయంలో కూడా విజయ్ వెంట విష్ణురెడ్డి కనిపించడం ఆయన ప్రాధాన్యతను మరింత స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం, పార్టీ వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియా వర్గాలు చర్చిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ప్రస్తుతం విష్ణురెడ్డి ఫొటోలు, ఆయన నేపథ్యానికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. “తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి ప్రభావం” అంటూ నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

విజయ్ రాజకీయ ప్రయాణంలో విష్ణురెడ్డి భవిష్యత్‌లో మరింత కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం తెర వెనుక వ్యూహకర్తగా ఆయన పేరు బలంగా వినిపిస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!