ఏపీ నుంచి తమిళనాడు వరకు

Must read

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాజకీయ వ్యూహరచన రంగంలో పనిచేసిన ఓ యువతి, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్​. కీర్తన అనే 29 ఏళ్ల యువ నాయకురాలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరవెనుక వ్యూహాలు రచించిన ఆమె, ఇప్పుడు తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్​ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటించిన మంత్రివర్గంలో కీర్తనకు చోటు కల్పించడం రాజకీయంగా కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఆమె టీవీకే కేబినెట్‌లో అతి పిన్న వయస్కురాలిగా మాత్రమే కాకుండా, ఏకైక మహిళా మంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే విజయ్ ఆలోచనకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

విరుదునగర్ జిల్లాలోని శివకాశీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన మరో ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. “భారత బాణసంచా రాజధాని”గా పేరొందిన శివకాశీ నియోజకవర్గ చరిత్రలో తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె నిలిచారు. దాదాపు ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థి గెలవకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో కీర్తన విజయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

1996లో తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో జన్మించిన కీర్తన సాధారణ కుటుంబంలో పెరిగారు. ప్రభుత్వ తమిళ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆమె, చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. ఉన్నత విద్యపై ఆసక్తితో ముందుకు సాగిన ఆమె, మధురాయ్​ కామరాజ్​ యునివర్సిటీ అనుబంధ కళాశాలలో బీఎస్సీ మ్యాథమెటిక్స్‌లో పట్టా పొందారు. అనంతరం గణాంక శాస్త్రంపై ఆసక్తితో పాండిచ్చేరి యునివర్సీటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన కీర్తన, ఆ తర్వాత ప్రజా జీవితంపై ఆసక్తితో రాజకీయ వ్యూహరచన రంగంలో అడుగుపెట్టారు. ఎన్నికల వ్యూహాలు, డేటా విశ్లేషణ, ఓటర్ల అభిరుచుల అధ్యయనం వంటి అంశాల్లో ఆమె ప్రత్యేక నైపుణ్యం సంపాదించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూడా తెరవెనుక వ్యూహాల రూపకల్పనలో ఆమె పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది.

డేటా ఆధారిత రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో కీర్తన ప్రతిభ టీవీకే నాయకత్వాన్ని ఆకట్టుకున్నట్లు సమాచారం. పార్టీ ఏర్పాటులో ప్రారంభం నుంచే విజయ్‌కు సన్నిహితంగా పనిచేసిన ఆమె, యువతలో పార్టీ ప్రభావం పెంచేందుకు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం, యువ ఓటర్ల ఆకర్షణలో ఆమె వ్యూహాలు ఉపయోగపడ్డాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన విజయం సాధించడం వెనుక యువ బృందం కృషి కూడా కీలక కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 108 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీవీకే, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో కీర్తనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లు విజయ్ సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతున్న సమయంలో కీర్తన ఎదుగుదల ప్రేరణాత్మకంగా మారింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత చదువులు పూర్తి చేసి, రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందిన తర్వాత మంత్రి స్థాయికి ఎదగడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో కొత్త రాజకీయ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కీర్తన పాత్రపై ఆసక్తి పెరుగుతోంది. మంత్రిగా ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. యువత, విద్య, మహిళా సంక్షేమం లేదా డిజిటల్ పరిపాలనకు సంబంధించిన శాఖలు ఆమెకు దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!